ఎప్పటికైనా తిరుపతిలోనే పెళ్లిచేసుకుంటాను: ప్రభాస్ 

ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఆదిపురుష్’ సినిమా రెడీ అవుతోంది. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, ఓమ్ రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఈవెంట్ కి చినజీయర్ స్వామి హాజరయ్యారు. వేల సంఖ్యలో ప్రభాస్ అభిమానులు తరలి వచ్చారు.

ముందుగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ .. రాముడిని మానవులు .. మహర్షులు మాత్రమే కాదు, పశువులు .. పక్షులు కూడా ప్రేమించాయని అన్నారు. రాముడు ధర్మస్వరూపుడు అని మారీచుడు వంటివారు చెప్పడం, ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. మానవజాతిని ధర్మ మార్గంలో నడిపించిన రాముడి చరిత్రను ఈనాటి టెక్నాలజీతో అందిస్తుండటం ప్రశంసనీయమని అన్నారు. ఈ సినిమాలో తనలోని రాముడిని ప్రభాస్ బయటికి తీశారంటూ అభినందించారు.

ఇక ప్రభాస్ స్టేజ్ పైకి వస్తూనే .. అభిమానుల కోసం సరదాగా విల్లు ఎక్కుపెట్టారు. అభిమానుల కోసమే తాను ఎక్కువ సినిమాలు చేస్తున్నట్టుగా చెప్పారు. స్టేజ్ చుట్టూ ఉన్నవారు ఆయన పెళ్లి గురించి అడిగారు. ‘ఎప్పటికైనా తిరుపతిలోనే చేసుకుంటాను’ అంటూ వాళ్లను ఖుషీ చేశారు. ఈ సినిమా చేయడం తన అదృష్టమనీ .. తనతో చిరంజీవిగారు కూడా అదే మాట అన్నారని చెప్పారు. ఓం రౌత్ వంటి దర్శకుడిని తన కెరియర్లో చూడలేదంటూ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *