పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడాలని.. సంస్కార హీనుడైన నిరంజన్‌కు, వీధి చివరన ఉన్న కుక్కకు ఏమైనా తేడా ఉందా? అంటూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రస్థానం 148 వ రోజు వనపర్తి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. తనని మంగళవారం మరదలు అని సంబోధించిన మంత్రి నిరంజన్ రెడ్డి పై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవడ్రా నీకు మరదలు అంటూ ఆగ్రహించారు. నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తున్న నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా? అంటూ ఫైరయ్యారు. ఆ మాట అన్నందుకు సిగ్గుండాలన్నారు. అధికార మదం తలకు ఎక్కిందా? అంటూ నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే, ఈ మంత్రి హమాలీ పని చేసుకో అన్నారని చెప్పారు. 5, 6 తరగతులు చదివిన వాళ్ళు మంత్రులు అవ్వొచ్చు.. డిగ్రీ, పీజీలు చదివిన వాళ్లు హమాలీ పని చేయాలా? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులంటే ఈ మంత్రికి లెక్కే లేదన్నారు.
పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా కన్నీళ్లు మిగిల్చారని.. ఆయన నీళ్ల నిరంజన్ కాదు, కన్నీళ్ళ నిరంజన్ రెడ్డి అని షర్మిల ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కాక ముందు ఆయన దగ్గర డబ్బులే లేవని.. అలాంటి వ్యక్తి ఇవాళ వేల కోట్లు ఎలా సంపాదించారని అడిగారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం నిరంజన్ రెడ్డి అని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూములు, గుడి మాన్యాలు, గుట్టలు మింగేశారని ఆరోపించారు. చెరువుల పేరు చెప్పి, వందల కోట్లు దోచుకున్నాడని అన్నారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కాదని, చేతకాని మంత్రి అని విమర్శించారు. సన్నాలు వేసుకోమని చెప్పి మద్దతు ధర కల్పించలేని సన్నాసి అని తిట్టారు. ఎరువుల కోసం రైతులు లైన్‌లో నిలబడి చనిపోతే, సినిమా టిక్కెట్‌ల కోసం నిలబడటం లేదా అని చెప్పి.. రైతుల్ని సినిమా టిక్కెట్‌లతో పోల్చారన్నారు. వరి వేసుకుంటే ఉరి అని ముఖ్యమంత్రి అంటే.. వరి వేసుకోవద్దు అని ఈ మంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ సన్నాసులకు పరిపాలన చేతన అవుతుందా? అంటూ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : కెసిఆర్ ఏం చేసినా ఓట్ల కోసమే వైఎస్ షర్మిల ఆరోపణ