ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ కేంద్ర రాజధాని ప్రాంత ప్రభుత్వం (సవరణ) బిల్లు-2023 పై ముర్ము శనివారం సంతకం చేశారు. దీంతో ఇది చట్టంగా అమల్లోకి వచ్చింది.
ఢిల్లీ అధికారులపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కల్పించేలా ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. పాలనా యంత్రాంగంపై ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తున్న ఈ బిల్లును ఆప్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ మేరకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్ష పార్టీల మద్దతు కూడగట్టారు. అయినప్పటికీ అధికార, విపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై తాజాగా రాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టంగా మారింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మరో మూడు బిల్లులకు రాష్ట్రపతి ఈరోజు ఆమోదం తెలిపారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్‌విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లులపై రాష్ట్రపతి నేడు సంతకం చేశారు. దీంతో ఈ బిల్లులు కూడా ఇప్పుడు చట్టంగా మారాయి.