ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐ.ఎస్.ఐ) సంస్థను ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన స్వలాభం కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ఘాటుగా విమర్శించారు. పార్లమెంటు, న్యాయవ్యవస్థ తో అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా ఇమ్రాన్ ఖాన్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో మీద బాంబు దాడి జరిగి 13ఏళ్ళు అయిన సందర్భంగా కరాచిలో నిర్వహించిన కార్యక్రమంలో బిలావల్ భుట్టో పాల్గొన్నాడు. మీడియాతో సహా అన్ని సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రధానమంత్రి అనైతిక పద్దతులు అవలంభిస్తున్నాడని మండిపడ్డాడు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పి.టి.ఐ.) పార్టీ కరోనా రిలీఫ్ టైగర్ ఫోర్సు పేరుతో నిధులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడిందని బిలావల్ అన్నారు. లెక్కకు మించిన విరాళాలు వచ్చినా అవసరమైన వారికి సాయం చేయటంలో ప్రభుత్వం, పి.టి.ఐ, విఫలమయ్యాయన్నారు. ఐ.ఎస్.ఐ డైరెక్టర్ జనరల్ నదీం అహ్మద్ అంజుం నియామకంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనుసరించిన వైఖరికి సైనిక, పౌర నాయకత్వాల మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయన్నారు. పాక్ మిలిటరీ మీడియా విభాగం చెపుతున్న దానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలకు పొంతన లేదని బిలావల్ విమర్శించారు. ప్రజా వ్యతిరేఖ విధానాలు అనుసరిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పతనం ఆరంభం అయిందని, తొందరలోనే ప్రజలు తగిన గుణపాటం చెపుతారని బిలావల్ అన్నారు. చమురు నుంచి నిత్యావసరాల వరకు ధరలు పెరిగి ప్రజలు అర్ధాకలితో అలమతిస్తున్నారన్నారు.
ఐ.ఎస్.ఐ చీఫ్ నియామకంలో నెలకొన్న అపోహలు త్వరలోనే తొలగిపోతాయని పాక్ అంతరంగిక శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. వచ్చే శుక్రవారం లోగా అన్నీ సర్దుకుంటాయని ఆయన వివరించారు.