ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని, ముఖ్యంగా వైద్య విద్యార్థుల తరలింపు కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని ప్రధాని వివరించారు. దేశ పౌరుల్ని ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందని, ఇందు కోసం ఇప్పటికే విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
రాష్ట్రపతిని కలిసే ముందు ప్రధాని ఉక్రెయిన్ పరిస్థితిపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమయంలో నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు భారతదేశ ప్రత్యేక రాయబారులుగా పంపించాలని ప్రధాని నిర్ణయించారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను తరలించే ఆపరేషన్‌ను సమన్వయం చేసేందుకు మోదీ మంత్రులను పంపించారు.హర్దీప్ పూరీ హంగేరీలో ఉండగా, పోలాండ్‌లో భారతీయుల తరలింపు కార్యకలాపాలను వీకే సింగ్ పర్యవేక్షిస్తారు.
రొమేనియా, మోల్డోవా నుంచి తరలింపు ప్రయత్నాలను జ్యోతిరాదిత్య సింధియా చూసుకుంటారు. కిరణ్ రిజిజు స్లోవేకియాలో ఉక్రెయిన్ నుంచి భూ సరిహద్దుల ద్వారా వచ్చిన భారతీయుల తరలింపును పర్యవేక్షిస్తారు.
మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 182 మంది భారతీయ పౌరులతో ఏడవ తరలింపు విమానం ఆపరేషన్ గంగాలో భాగంగా భారతదేశానికి తిరిగి వచ్చింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం సమన్వయంతో ప్రయత్నాలు చేస్తోంది.ఉక్రెయిన్‌లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి మంగళవారం నిర్వహించిన అత్యవసర చర్చలో భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది.