ప్రధానమంత్రి నరెంది మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ఈ రోజు పయనం అయ్యారు. సాయంత్రం పారిస్ చేరుకోగానే ఆదేశ ముఖ్య నేతలతో మోడీ సమావేశం అవుతారు. ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈరోజు ఆ దేశానికి చేరుకోనున్న ప్రధాని.. శుక్రవారం జరగనున్న బాస్టిల్ డే గా పిలిచే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో.. గౌరవ అతిథిగా మోదీ పాల్గొననున్నారు. జులై 14న జరిగే బాస్టిల్ డే పరేడ్‌కు.. మోదీని అహ్వానించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని స్వయాన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ట్వీట్ చేశారు. బాస్టిల్ డే వేడుకలకు భారత ప్రధానిని ఫ్రాన్స్ ఆహ్వానించడం ఇది రెండోసారి. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. భారత నౌకా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై మోదీ ప్రకటన చేసే అవకాశముంది. వీటితోపాటు రక్షణ రంగంలో మరికొన్ని ఒప్పందాలు కూడా రెండు దేశాలూ కుదుర్చుకునే అవకాశముంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో ఈ ఏడాది భారత్ కు చెందిన త్రివిధ దళాలు పరేడ్ లో పాల్గొంటాయి. ఫ్రాన్స్ పర్యటన అనంతరం యూఏఈకి మోడీ పయనమవుతారు.