Saturday, November 23, 2024
HomeTrending Newsబిజెపికి నూకలు చెల్లినయి - మంత్రి హరీష్

బిజెపికి నూకలు చెల్లినయి – మంత్రి హరీష్

Prime Minister Apologize  : ప్రధాని బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల  అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. మొదటి దశ కరోనాకు భయపడి వలస కార్మికులు చాలా మంది కాలి నడకన వెళ్ళారని, వలస కార్మికులకు సమయం ఇవ్వకుండా లాక్ డౌన్ పెట్టారని మంత్రి ఆరోపించారు. వరంగల్ జిల్లా, ఎంజీఎం ఆస్పత్రిలో పిల్లల కోవిడ్ ప్రత్యేక వార్డును మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్ ,ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ మేయర్ శ్రీమతి సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్ ఇతర స్థానిక నాయకులు, అధికారులు కలిసి ప్రారంభించారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలపై, రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆయన మాటలు…

కేంద్రం వలస కార్మికులను పట్టించుకోలేదని, సీఎం కేసిఆర్ రైళ్లు పెట్టీ, భోజనం పెట్టీ పంపారని మంత్రి గుర్తు చేశారు. వలస కార్మికులను సొంత ఊర్లకు పంపడం వల్ల కరోనా పెరిగిందని, ప్రధాని అన్నారు. వారిపై ప్రధానికి అంత చిన్న చూపు ఉంది. వలస కార్మికులను పట్టించుకోవడంలో కేంద్రం దారుణంగా  ఫెయిల్ అయ్యింది. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ను తీసుకొచ్చి లక్ష మందితో మీటింగ్ పెడితే కరోనా పెరుగదా? పెద్ద, పెద్ద సభలు, కుంభ మేళాలు, ఎన్నికల ర్యాలీలు పెడితే కరోనా పెరగలేదు.. కానీ వలస కార్మికులు ఊర్లకు వెళ్తే కరోనా పెరిగింది అంటే ఎంత దారుణం. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య వేరొకటి లేదు. ప్రధాని మాటలు అత్యంత బాధాకరం. బీజేపీ నేతలకు ఇది అర్దం కావాలి.

తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని ప్రధాని తక్కువ చేస్తున్నారు. ఇది అమర వీరులను, త్యాగాలను తక్కువ చేయడమే. పైగా దీనికి స్పందిస్తే మేము తెలంగాణ సెంటిమెంట్ రెచ్చ గొట్టడం అంటున్నారు. ఇందులో రెచ్చ గొట్టడం ఏముంది?  ప్రజల పోరాటాన్ని చిన్నగా చేస్తున్నారు. గతంలో కూడా తల్లిని చంపి, బిడ్డను బతికించారు అన్నారు ఈ ప్రధాని. అద్వానీ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వరు? దేశంలో అనేక విద్యా సంస్థలు ఇస్తే మాకు ఒక్క మెడికల్ కాలేజీ, ఐఐటీ, ఐఐఎం, నవోదయ విద్యాలయం ఇవ్వలేదు. కానీ మాటలతో హింస, అవమానం చేస్తున్నారు.

మీరు వ్యవసాయ చట్టం తెచ్చారు ఎందుకు?దీనిని అందరూ వ్యతిరేకించారు. ఓటింగ్ ఎందుకు జరపలేదు ఎందుకు? చెప్పాలి. ఎన్నో పోరాటాలు చేస్తే.. అన్ని పార్టీలు ఒప్పుకుని ఏర్పాటు చేసిన తెలంగాణను తప్పు పడుతారా? విషం చిమ్ముతారా? మీకు నూకలు చెల్లాయి. మా నిధులు మాకు ఇవ్వడం లేదు. పైగా సూటి, పోటి మాటలతో తెలంగాణను కించపర్చడం, అవమానించడం, తక్కువ చేసి మాట్లాడడం చేస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు ఇవి చూసైనా సోయి తెచ్చుకోవాలి. తెలంగాణ పట్ల ఇలా చేస్తుంటే మీ మనసు ఎట్లా ఒప్పుకుంటుంది? ఎట్లా సమర్దన చేస్తారు? దేశంలో ఎంపీలు గ్రామాలు దత్తత తీసుకోవాలని చెబితే..తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కూడా గ్రామాలు దత్తత తీసుకున్నారు. అలాంటి వాటిలో 10 ఉత్తమ గ్రామాలు ఎంపిక చేస్తే వాటిలో ఏడు తెలంగాణలో వచ్చాయి. ఇవి మా పని తీరుకు నిదర్శనం కాదా? మీకు కండ్లు కనిపించడం లేదా?  మీరంతా గోబెల్స్ అని తెలుసు. మీ నీతి బయట పడింది. మీ వైఖరి తెలిసింది.

రాష్ట్రాలు, కేంద్రాలు కలిసి ఉండాలి అని ప్రధాని అంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే మా 7 మండలాలు, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రలో కలపారు. మరి మా సీఎంతో మాట్లాడి చేశారా? దీనికి మీ సమాధానం ఏమిటి? జర్నలిస్టులు కూడా ప్రధాని మాటలను ఖండించాలి. Tngo లు ఖండించారు. మనమంతా ఖండించకపోతే ఆంధ్రలో కలిపే అవకాశం ఉంది. ఈ పుణ్యాత్ములు అంత పని చేసినా చేస్తారని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

Also Read : ప్రధాని వ్యాఖ్యలపై సభా హక్కుల నోటీసు

RELATED ARTICLES

Most Popular

న్యూస్