జగనన్నేమా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలూ స్వచ్చందంగా మెగా పీపుల్స్ సర్వేలో పాల్గొంటున్నారని, ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణలు తాదేపల్లిలోని వైఎస్సర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలి వారం రోజుల్లోనే వైసీపీ నేతలు, జగనన్న సైన్యం అయిన 7 లక్షల మంది గృహ సారథులు కలిసి రాష్ట్రంలోని 60 లక్షల కుటుంబాలను సందర్శించారని తెలిపారు.
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలు స్వయంగా వారి ఇళ్ళపై స్టిక్కర్లను అంటించుకుంటున్నారని, వారంలోనే ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభించడం దేశంలోనే ఓ చరిత్ర అంటూ జోగి రమేష్ అభివర్ణించారు. గతంలో ఎన్నడూ ఎన్నికలకు ఏడాది ముందు వరకూ ప్రజల వద్దకు వెళ్ళే పార్టీయే లేదని, కానీ తాము వెళ్లి చేసిన పనులు, సంక్షేమం తెలియజెప్పి ధైర్యంగా వారి మద్దతు కోరుతున్నామని ఆదిమూలపు సురేష్ అన్నారు.
నాలుగేళ్ళుగా తాము అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల పనితీరు తెలుసుకునేందుకు ప్రజల వద్దకే వెళ్లి మెగా సర్వే చేయించడానికి ధైర్యం ఉండాలని, జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే ప్రతి ఇంటికీ తన సైనికులు గృహ సారధులను, ఎమ్మెల్యేలను, నేతలను పంపుతున్నారని మంత్రి రోజా ప్రశంసించారు. ఇప్పటికే దాదాపు 50 లక్షల మంది మిస్స్డ్ కాల్స్ ఇచ్చి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. జగనన్న పాలనలో మంచి జరిగిందని ప్రజలు సంతోషంగా చెబుతున్నారన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే పూర్తయిన తర్వాత వారి అనుమతి తీసుకున్న తర్వాతే స్టిక్కర్ అన్తిస్తున్నామని రోజా స్పష్టం చేశారు. టిడిపి, జనసేన, కొన్ని మీడియా సంస్థలు స్టిక్కర్లను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
చంద్రబాబు తన మేనిఫెస్టో తీసుకొని రావాలని, జగనన్న మేనిఫెస్టో తీసుకొని తాను వస్తానని.. కుప్పంలో గానీ, నగరిలో గానీ ఇళ్ళకు వెళ్లి ఎవరి వల్ల మేలు జరిగిందో అడుగుదామని… ఇద్దరం చెప్పిన తరువాత ఎవరితో ప్రజలు సేల్ఫీ తీసుకుంటారో తేల్చుకుందామని సవాల్ చేశారు. ట్వంటీ ట్వంటీ ఫోర్- జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని రోజా చెప్పారు.