Sunday, January 19, 2025
HomeTrending Newsప్రజాశ్రేయస్సే పరమావధి.. సీఎం స్టాలిన్

ప్రజాశ్రేయస్సే పరమావధి.. సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ గద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నారు. డీఎంకే అధినేత ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకెళుతున్నారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం చాలా సాహసోపేతమైన ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒకేరోజు అటు కేంద్రప్రభుత్వానికి.. ఇటు వైద్య విద్యార్థులకు గట్టి షాకులు ఇచ్చి తమిళనాడు సిఎం స్టాలిన్ పెను సంచలనాలు సృష్టించాడు. అలా చేయడం ద్వారా స్టాలిన్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నాడు.

సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి స్టాలిన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో ఆదరణ చూరగొంటున్నాయి.. ముందుగా యూనివర్సిటీలు.. కాలేజీలలో ప్రొఫెషనల్స్ కోర్సులలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం కోటాను అందించి పేద విద్యార్థుల మనసు దోచేశాడు. ఇది చాలా ధైర్యమైన స్టెప్ అని చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్వహణ పాఠశాలల విశ్వసనీయతను పెంచేలా చేసింది..

ఇటీవల సీఎం స్టాలిన్ ఎన్నడూ లేనంతగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించారు. తమిళనాడులో పెట్రోల్.. డీజిల్ ధరలు 3 రూపాయలు తగ్గించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 1190 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. ఏదేమైనా స్టాలిన్ నిర్ణయాన్ని సామాన్యులు సైతం బాగా ప్రశంసిస్తున్నారు.

ఇక సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీని ఆశ్చర్యపరిచారు. 65 లక్షల స్కూల్ బ్యాగ్లపై అన్నాడీఎంకే మాజీ సీఎంలు జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలు ఉంచాలని స్టాలిన్ విద్యాశాఖను ఆదేశించడం సంచలనమైంది. ఈ బ్యాగులను రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించాడు.

కొత్త బ్యాగులు.. వస్తు సామగ్రి కోసం ఆర్డర్లు ఇవ్వడానికి బదులుగా ఉపయోగించని ఈ బ్యాగులను పంపిణీ చేయాలని సిఎం స్టాలిన్ నిర్ణయించాడు. ఇది రాష్ట్ర ఖజానాకు రూ .13 కోట్లు ఆదా చేసింది. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి ఆశ్చర్యపోయారు. డీఎంకే క్యాడర్లోని అసంతృప్తి గురించి ఆయన తెలియజేసినా స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

పథకాలు పనుల్లో రాజకీయ చొరవ వద్దని.. ప్రభుత్వ చొరవ కావాలని సీఎం స్టాలిన్ సమాధానమిచ్చారు. సీఎం స్టాలిన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష అన్నాడీఎంకే స్వాగతించింది. స్టాలిన్ నాయకత్వంలో ప్రతీకార రాజకీయాలు తగ్గాయని అన్నాడీఎంకే కొనియాడింది.

ఇక్కడితో ఆగకుండా స్టాలిన్ పేదలకు ఉచితంగా/ సరసమైన ధరలో ఆహారాన్ని అందించే అమ్మ క్యాంటీన్ల నుండి జయలలిత .. ఫళనిస్వామి ఫోటోలను తొలగించవద్దని అధికారులను కోరారు. ఇవన్నీ చర్యలతోనే ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో స్టాలిన్ను దేశంలోనే ‘ఉత్తమ ముఖ్యమంత్రి’గా మార్చాయని అంటున్నారు.

-కేంద్రానికి షాక్.. వ్యవసాయ బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేకం

ఇక కేంద్రంలోని బీజేపీకి షాకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన అడుగులు వేశాడు. కేంద్రం ఆమోదించిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. శాసనసభలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం స్టాలిన్. చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్న స్టాలిన్.. వ్యవసాయ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

-వైద్యవిద్యార్థులకు సీఎం స్టాలిన్ షాక్

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అందించడానికి ఇష్టపడని విద్యార్థుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఎంబీబీఎస్ చదివి పీజీ చేసిన వారు ఖచ్చితంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అందస్తామంటూ హామీ పత్రం రాసిస్తారు. అయితే ఈ అండర్ టేకింగ్ చదువు పూర్తి కాగానే విద్యార్థులు ఎవరూ చేయడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి లక్షలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్రామీణప్రాంతాల్లో పనిచేయడం లేదు.

తాజాగా తమిళనాడులో పీజీ అయిపోయిన 112 మంది వైద్య విద్యార్థులు తాము ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసేది లేదంటూ అడ్డం తిరిగారు. అండర్ టేకింగ్కు వ్యతిరేకంగా గొడవ మొదలుపెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం స్టాలిన్ ఏకంగా ఆ 112 మంది విద్యార్థులు ప్రభుత్వం ఇన్నాళ్లు వారిమీద పెట్టి ఖర్చుకు గాను తలా రూ.50లక్షలు ప్రభుత్వానికి వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. వైద్యవిద్యార్థులు ప్రభుత్వానికి రూ.50లక్షలు కడుతారా? లేదా ప్రభుత్వాసుపత్రుల్లో డ్యూటీ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. స్టాలిన్ సీఎంగా ప్రజా శ్రేయస్సు కోసం చేస్తున్న పనులు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్