Sikhar is back: చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి పరుగుల వేటలో వేటలో విఫలమైంది. ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో 11పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చెన్నై హిట్టర్ అంబటి రాయుడు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి విజయంపై ఆశలు రేకెత్తించినా 18వ ఓవర్లో రబడ అతణ్ణి బౌల్డ్ చేయడంతో మ్యాచ్ చేజారింది. పంజాబ్ ఆటగాడు శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత సత్తా చాటి 59 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్సర్లతో 88 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.
ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తొలి వికెట్ కు 37 (మయాంక్ అగర్వాల్-18) పరుగులు చేసింది. శిఖర్ ధావన్- భానుక రాజపక్షలు రెండో వికెట్ కు 110 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. రాకపక్ష-42 (32 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు); లివింగ్ స్టోన్ ఏడు బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 19 చేసి ఔటయ్యారు. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో రెండు, తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.
చెన్నై 40 పరుగులకే మూడు వికెట్లు (ఓపెనర్ ఊతప్ప-1; శాంట్నర్-9; శివం దూబే-8) కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్- అంబటి రాయుడు నాలుగో వికెట్ కు 49; రాయుడు-జడేజాతో ఐదో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయంపై ఆశలు కలిగించారు. రుతురాజ్-30; జడేజా-21 పరుగులు చేసి ఔటయ్యారు. కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న రాయుడు 18వ ఓవర్ లో ఔటయ్యాడు. గత మ్యాచ్ లో చివరి బంతికి విక్టరీ అందించిన ధోనీ కూడా 12 పరుగులకు వెనుదిరగడంతో చెన్నైకు ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో రబడ, రిషి ధావన్ చెరో రెండు, ఆర్షదీప్ సింగ్, సందీప్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
శిఖర్ ధావన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ఐపీఎల్: ముంబై అదే తీరు- ఎనిమిదో ఓటమి