ఐపీఎల్ లో నేడు జరిగిన మరో ఉత్కంత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. చెన్నై 200 పరుగులు చేయగా పంజాబ్ చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన దశలో సికిందర్ రాజా బంతిని బౌండరీ లైన్ సమీపానికి తరలించి మూడు పరుగులు తీసి విజయం అందించాడు.
చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ధోనీ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 52 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ తో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్-37; శివమ్ దూబే-28; మోయిన్ అలీ-10; రవీంద్ర జడేజా-12; కెప్టెన్ ధోని-13 (నాటౌట్) పరుగులు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికేట్లుకోల్పోయి 200 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, రాహుల్ చాహర్, శామ్ కర్రన్, సికందర్ రాజా తలా ఒక వికెట్ పడగొట్టారు.
పంజాబ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సిమ్రాన్ సింగ్-42; కెప్టెన్ శిఖర్ ధావన్-28; అథర్వ్ తైడే-19; లివింగ్ స్టోన్-40; శామ్ కర్రన్-29 పరుగులు చేశారు. చివరి రెండు ఓవర్లకు 22 పరుగులు కావాల్సిన దశలో 10 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 21 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న జితేష్ శర్మను తుషార్ దేశ్ పాండే ఔట్ చేశాడు. షేక్ రషీద్ బౌండరీ లైన్ వద్ద వెంట్రుక వాసి తేడాతో అద్భుతంగా పట్టిన క్యాచ్ కు జితేష్ వెనుదిరిగాడు. ఇతని స్థానంలో వచ్చిన సికిందర్ రాజా వేగంగా ఆడుతూ ఏడు బంతుల్లో ఒక ఫోర్ తో 13 పరుగులు చేసి అపూర్వ విజయం అందించాడు.
చెన్నై బౌలర్లో తుషార్ దేశ్ పాండే 3; జడేజా 2; మతీష పతిరణ ఒక వికెట్ పడగొట్టారు.
డెవాన్ కాన్వే కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.