పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు. మాస్ మెచ్చే సినిమాలను ఆయనలా మరొకరు తీయలేరనే టాక్ ఉంది. పక్కా మాస్ కంటెంట్ లో ఆయన సెట్ చేసే లవ్ ట్రాక్ కారణంగా యూత్ కూడా ఆయన సినిమాలకి విపరీతంగా వస్తుంటారు. ఇక చాలా సింపుల్ గా అనిపిస్తూనే డైనమేట్ లా పేలే ఆయన డైలాగులను ఇష్టపడని వారంటూ ఉండరు. చాలా ఫాస్టుగా కథ .. కథనం .. డైలాగులు పట్టుకుని సెట్స్ పైకి వెళ్లడం, అంతే ఫాస్టుగా ఆ ప్రాజెక్టును పూర్తిచేసి తెరపైకి తీసుకుని రావడం ఆయన ప్రత్యేకత.
‘బిజినెస్ మేన్’ .. ‘టెంపర్’ తరువాత ఆ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకోవడానికి ఆయన ‘ఇస్మార్ట్ శంకర్’ వరకూ వెయిట్ చేయవలసి వచ్చింది. ఈ మధ్యలో వచ్చిన వరుస ఫ్లాపుల కారణంగా అంతా కూడా ఇక పూరి పనైపోయిందని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆయనను ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి .. వరుస పరాజయాల నుంచి బయటపడేసింది. పూరి కాస్త శ్రద్ధ పెడితే ఆయన సినిమా ఏ స్థాయిలో వసూళ్ల సునామీని సృష్టిస్తుందనేది ఈ సినిమా నిరూపించింది.
ఆ తరువాత సినిమాగా ఆయన వెంటనే ‘ లైగర్’ను మొదలుపెట్టాడు. అయితే కోవిడ్ కారణంగా ఆ సినిమాకి మూడేళ్ల సమయం పట్టేసింది. విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది ఫస్టు పాన్ ఇండియా సినిమా. ఆల్రెడీ రెండు ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండకి కూడా ఈ హిట్ చాలా అవసరం. ఈ సినిమా పరంగా కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు ప్రమోషన్స్ లో పూరి చెబుతూ వస్తున్నాడు. ‘ఒక్కొక్కరు ఒక్కో టికెట్టు కొన్నా చాల్రా బాబూ’ అంటూ ఆయన ఈవెంట్ లో చెప్పడం గమనించదగిన విషయం. బాక్సింగ్ నేపథ్యంతో కూడిన మాస్ కంటెంట్ తో పూరి ఇచ్చే కిక్ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుందేమో చూడాలి.
Also Read : మహేష్ తో సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్న పూరి