రాజకీయ లబ్ది కోసం వాడుకుని వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నైజమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు ఛరిష్మాను వాడుకుని లబ్ది పొందిన కేసీఆర్… ఎన్నికలయ్యాక ఆయనను పూర్తిగా విస్మరించారని అన్నారు. పీవీ జయంతి ఉత్సవాలకు కూడా హాజరుకాకపోవడం సిగ్గు చేటన్నారు. స్వర్గీయ పీవీ నర్సింహారావు 101వ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ ను సందర్శించిన బండి సంజయ్ ఈ సందర్భంగా పీవీకి ఘన నివాళి అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు… ముఖ్యాంశాలు…
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు బహుభాషాకోవిదుడు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు పాలించిన రాజనీతిజ్ఝుడు తెలంగాణలో జన్మించడం… అందులోనూ కరీంనగర్ జిల్లాకు చెందిన బిడ్డ కావడం అద్రుష్టంగా భావిస్తున్నా. సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నర్సింహారావు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి. పేదల గురించి నిత్యం ఆలోచించిన వ్యక్తి.
పీవీ, తెలుగు ఠీవీ అని వల్లించే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పీవీ జయంతికి కూడా రాలేదు. ఆయనకున్న అంత బిజీ ఏమిటి? బహుశా…. ఎలక్షన్లు లేవుగా… తెల్లారిలేస్తే ఆయనకు కావాల్సింది రాజకీయాలే… ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు, కార్పొరేషన్ ఎన్నికలప్పుడు పీవీ తెలుగు ఠీవీ అన్నడు….. ఎన్నికలయ్యాక మర్చిపోయిండు.. పీవీ ఘాట్ కు రూ. వంద కోట్లు ఖర్చు పెడతానన్నవ్? శత జయంతి ఉత్సవాలు ఎన్నిదేశాల్లో జరిపినవ్. కేసీఆర్, ఆయన కొడుకు ఫోటోలతో ఫ్లెక్సీలు వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు. పీవీ జన్మస్థలం వంగరను అభివ్రుద్ది చేస్తా… స్మారక కేంద్రం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. అవసరమైతే కాళ్లు… లేదంటే జుట్టు పట్టుకునే వ్యక్తి కేసీఆర్… ప్రజలంతా కేసీఆర్ తీరు చూసి థూ.. ఛీ అని చీదరిస్తున్నరు. కనీస ఇంగిత జ్ఝానం లేని మూర్ఖుడు. పీవీ అభిమానాలు, కుటుంబ సభ్యులు గుర్తించాలి.
కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలి. గాంధేయతర కుటుంబ వ్యక్తి దేశ ప్రధాని కావడాన్ని గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. రాజకీయ చతురతతో దేశాన్ని పాలించినా ఓర్వలేక, సహించలేకపోయింది. పీవీ శవాన్ని కూడా కాలకుండా చేశారు. పీవీ జయంతి ఉత్సవాలకు కూడా హాజరు కావడం లేదు. ప్రధానుల జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో పీవీ చరిత్రను కూడా దేశానికి చాటిన గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ. ఏ నాయకుడి జయంతి, వర్దంతులనైనా మానవతాస్పూర్తితో నిర్వహించాలి. కానీ మానవత్వం లేని మూర్ఖుడు కేసీఆర్. ఇకనైనా తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. పీవీ జయంతికి హాజరై నివాళి అర్పించి స్మరించుకోవాలని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
Also Read : ఆధునిక భారత నిర్మాత పివి – కెసిఆర్