Rajya Sabha Candidature: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. వీరిద్దరితో పాటు న్యాయవాది, సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు లను అభ్యర్దులుగా వైఎస్సార్ సీపీ ప్రకటించింది. తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ఆర్.కృష్ణయ్య, రెన్యువల్ ఇచ్చినందుకు విజయసాయి రెడ్డిలు కృతజ్ఞతలు తెలియజేశారు. సిఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కృష్ణయ్య వెల్లడించారు. దశాబ్దాలుగా బీసీల సమస్యలపై తాను పోరాడుతున్నానని, ఆ అంకిత భావాన్ని గుర్తించే జగన్ తనకు అవకాశం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. బీసీలు అంటే బ్యాక్ బోన్ కాస్ట్ అంటూ సిఎం జగన్ మొదటినుంచీ చెబుతున్నారని, అదే రీతిలో పదవులు ఇస్తున్నారని చెప్పారు.
తనపై నమ్మకం ఉంచి, అచంచల విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజ్యసభకు రెండోసారి పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు విజయ సాయి రెడ్డి. జగన్ , ఆయన కుటుంబ సభ్యులు భారతమ్మ లకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యసభ అనేది రాష్ట్రాల సభ కాబట్టి రాష్ట్ర సమస్యలను పార్టీపరంగానూ, గౌరవ సీఎం మనసులోని ఆకాంక్షలకు అనుగుణంగానూ నడుచుకుంటూ, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని విజయసాయి వెల్లడించారు.
ఇప్పుడు రాజ్యసభలో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు బీసీలు ఉన్నారని, వచ్చే నెల నాటికి రాజ్యసభలో మొత్తం 9 మంది వైయస్సార్‌సీపీ సభ్యులు ఉంటే, వారిలో 5గురు బీసీలు ఉంటారని, దీన్ని బట్టి బీసీలకు సీఎం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. బీసీ. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు, బడుగు, బలహీనవర్గాలకు వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు ఇస్తున్న ప్రాధాన్యత, వారికి సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా నడిపించాలన్న ఆయన ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
Also Read : మరో 25 ఏళ్ళు మేమే : విజయసాయి ధీమా