Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఊరి పెద్దల తీర్పు శిరోధార్యం

ఊరి పెద్దల తీర్పు శిరోధార్యం

No Police: గురజాడ ‘కన్యాశుల్కం’లో జట్కా బండి తోలుకొనే అతను ‘తెల్లదొరల రాజ్యం పోయి స్వరాజ్యం వస్తే ఆ ఊరి కానిస్టేబుల్ పోతాడా’ అని అడుగుతాడు. అది స్వాతంత్ర్యం రావడానికి చాలా ముందుమాట. స్వరాజ్యం వచ్చాక ఆ ఇంగ్లీషు కానిస్టీపు పోయి…మన రక్షకభటుడు వచ్చాక జట్కాబండి అతనికి ఎలాంటి మార్పు కనిపించింది అన్నది ఇక్కడ అనవసరం.

యాభై ఏళ్ల కిందట ఒక సాహితీ సంకలనం ‘మహతి’కి ప్రఖ్యాత కథారచయిత మధురాంతకం రాజారామ్ కథా శిల్పం గురించి ఒక ప్రత్యేక వ్యాసం రాశారు. కథ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్నది అందులో విషయం. కథలో వర్ణనలు ఎంతవరకు ఉండాలి? అన్న సందర్భంలో ఫలానా ఆయన కూర్చున్నాడు. ఆయన వెనుక గోడమీద తుపాకీ వేలాడుతోంది- అని వర్ణిస్తే…కథ అయిపోయేలోపు ఆ తుపాకీని వాడాలట. లేకపోతే పాఠకుడికి ఆ తుపాకీ గురించి సమాచారం ఎందుకు? అనవసరంగా ఆ తుపాకి ఎప్పుడు పేలుతుందో అని పాఠకుడు భయపడి చస్తూ చదువుతూ ఉంటాడు కదా? అన్నది మధురాంతకం ప్రశ్న.

ఆసుపత్రి పెట్టుకున్నవారు ఇబ్బడి ముబ్బడిగా రోగులు ఈసురోమంటూ తమ ఆసుపత్రికి రావాలనే కోరుకుంటారు. ఓ పి వార్డ్ మొదలు ఐ సి యూ లో వెంటిలేటర్ల దాకా ఏదీ ఖాళీ లేకుండా చిత్ర విచిత్ర నోరు తిరగని రోగాలతో రోగులు నిండిపోవాలనే దేవుడిని ప్రార్థిస్తారు. ఎవరికీ ఏ రోగం రాకుండా తమ ఆసుపత్రి ఈగలు తోలుకుంటూ ఉండాలని ఏ ఆసుపత్రీ కోరుకోదు. అలా కోరుకుంటే అది ఆసుపత్రే కాదు.

అలాగే…ఊళ్లో ఒక పోలీసు స్టేషన్ ఉందనుకోండి. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు…ఏదో ఒకటి జరిగి కేసులు స్టేషన్ గుమ్మం తొక్కాలనే అనుకుంటాయి. గోటితో పోయేదానికి  గొడ్డలిదాకా ఎలా వెళ్లాలో చెబుతాయి. ఇటు కేసు, అటు కేసు, కేసు మీద కేసు, పైరవీలు, ఒత్తిళ్లు, విచారణ పేరిట హింస, అవమానం, లంచాలు, లాఠీలు, తూటాలు…ఇదో అంతులేని కథ.

కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకుపోగలిగినవి కొన్ని;
తప్పొప్పుకుని క్షమాపణ చెబితే సమసిపోయేవి కొన్ని;
పెద్దలు కలుగజేసుకుని బుద్ధి చెబితే సరిపోయేవి కొన్ని;
సహజ న్యాయ సూత్రాలతో పరిష్కరించగలిగినవి కొన్ని;
మందలించి పంపగలిగినవి కొన్ని;
వీధి పంచాయతీకి కూడా పనికిరానంత చిల్లర గొడవలు కొన్ని…
ఇలాంటి నానా గొడవలతో మన పోలీస్ స్టేషన్లు నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. మనిషికొక పోలీసు ఉన్నా సరిపోనన్ని కొత్త కేసులు క్షణక్షణానికి పుట్టుకొస్తున్నాయి.

ఇలాంటివేళ ఒకానొక పల్లె నాలుగు దశాబ్దాలుగా పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కకుండా ప్రశాంతంగా ఉందని ఈనాడులో చక్కటి వార్త వచ్చింది. తెలంగాణాలో భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో దాదాపు వెయ్యి మంది జనాభా. నలభై ఏళ్ళల్లో ఈ ఊరి నుండి ఒక్క కేసు కూడా లేదని జిల్లా జడ్జి అధికారికంగా ప్రకటించి, ప్రశంసించారు కూడా.

ఎప్పుడయినా చిన్నపాటి గొడవలు జరిగినా ఊరి పెద్దల పంచాయతీ పరిష్కారంతో సరిపోతోంది. ఊళ్లో మద్యం బెల్ట్ షాపు వచ్చినప్పుడు మాత్రం గొడవలు పెరిగాయి. దాంతో ఊరి జనమే బెల్ట్ షాపును ఎత్తేయించారు. కొత్త తరం కూడా ఇలా తమలో తామే సామరస్యంగా గొడవలను పరిష్కరించుకోవాలని ఊరి పెద్దలు కోరుతున్నారు.

మధురాంతకం అన్నట్లు తుపాకీ అంటూ ఉంటే వాడాల్సిందే. పోలీసు స్టేషన్ అంటూ ఉంటే కేసులు పెట్టుకుని…కొట్టుకుని చావాల్సిందే.

అదే…పోలీస్ స్టేషన్ కే వెళ్లకూడదని నియమం పెట్టుకుంటే?
ఇది వినడానికి చిన్న విషయమయినా…నిజానికి చాలా పెద్దది.

ర్యాగట్లలో గట్ల పంచాయతీలు వస్తే రావచ్చు.
ర్యాగట్లలో కోపతాపాలు రేగితే రేగవచ్చు.
ర్యాగట్లలో పరస్పరం జుట్లు పట్టుకునే సందర్భం వస్తే రావచ్చు.

కానీ…అవన్నీ దూదిపింజలా ఊరి పంచాయతీలో తేలిపోతాయి.
కుబుసం విడిచినట్లు కోపం వీధి పంచాయతీలో దిగిపోతుంది.
పట్టుకున్న జుట్లు పెద్దల పంచాయతీలో వదులై సర్దుకుపోతాయి.

ఇలాంటి స్ఫూర్తిని అందిపుచ్చుకుని…మండలానికో ర్యాగట్లపల్లె ఆవిష్కారమయినా చాలు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

అప్పుడప్పుడూ కలుసుకుందాం….

Also Read : 

గాడ్ ఫాదర్ మదగజమా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్