Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్షూటింగ్ లో స్వర్ణం సాధించిన రాహి

షూటింగ్ లో స్వర్ణం సాధించిన రాహి

టోక్యో ఒలింపిక్స్ కు ముందు మన దేశానికి అన్నీ మంచి శకునాలు ఎదురవుతున్నాయి. నిన్న పారిస్ లో జరిగిన ప్రపంచ కప్ అర్చరీ మూడో దశలో మన ఆటగాళ్ళు నాలుగు విభాగాల్లో స్వర్ణాలు గెల్చుకుంటే, క్రొయేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐ.ఎస్.ఎస్.ఎఫ్.)వరల్డ్ కప్ లో నేడు మన దేశానికి స్వర్ణం లభించింది.

25ఎం పిస్టల్ విభాగంలో మనదేశానికి చెందిన రాహి సర్నోబట్ బంగారు పతకం సాధించింది. 39 పాయింట్లు సాధించిన రాహి మరో పాయింట్ (40) వస్తే ప్రపంచ రికార్డును నెలకొల్పి ఉండేది. వెండి పతకం సాధించిన ఫ్రెంచ్ క్రీడాకారిణి లామోల్లె కు-రాహికి మధ్య 8 పాయింట్ల తేడా ఉంది. మన దేశానికే చెందిన యువ సంచలనం మనో భాకర్ కూడా ఫైనల్స్ లో ఆడినప్పటికీ ఏడవ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ మనదేశం ఒక స్వర్ణం, ఒక వెండి, రెండు రజతాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు ఐ.ఎస్.ఎస్.ఎఫ్.లో సాధించింది.

ఇవాళ రాహి స్వర్ణం సాధించగా….. నిన్న సౌరభ్ చౌదరి-మనో భాకర్ జోడీ 10 ఎం ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో వెండి పతకం సాధించారు. మనో భాకర్ 10ఎం ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సంపాదించగా, సర్నోబట్, యశశ్విని, మనో భాకర్ జట్టు 10ఎం ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సంపాదించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన క్రీడాకారులకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేసింది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన రాహి షూటింగ్ లో పలుసార్లు మన దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించి పెట్టింది. 2013, 2019 సంవత్సరాల్లో కూడా ఛాంపియన్‌గా నిలిచింది. 2019 విజయంతో నేరుగా 2021 టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.

వచ్చేనెలలో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ లో మన ఆటగాళ్ళు పలు విభాగాల్లో తమ సత్తా చాటి ఈసారి మన క్రీడా గౌరవ పతాకాన్ని ఎగుర్వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్