అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ పై నిప్పులు చెరిగారు. కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లానని, కానీ మన ప్రధాని ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లలేదన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎందుకు వెళ్లలేదంటే, మణిపూర్ మన దేశంలో లేదని ఆయన భావిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ అన్న పదాన్ని తాను వాడానని, కానీ వాస్తవం ఏంటంటే ఆ రాష్ట్రం ఇక లేదన్నారు. మణిపూర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించినట్లు రాహుల్ పేర్కొన్నారు. మణిపూర్‌ను విభజించి, విడగొట్టినట్లు రాహుల్ అన్నారు. మణిపూర్‌ను చంపి భారత్‌ను హత్య చేశారని ఆరోపించారు. మీరే దేశద్రోహాలు అని రాహుల్ విమర్శించారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారన్నారు. రాహుల్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
భారత ప్రజల ఆవేదనను ప్రధాని మోదీ అర్థం చేసుకోరు అని, కానీ ఆయన ఇద్దరి వ్యక్తుల మాటలు వింటారని ఆరోపించారు. రావణుడు ఇద్దరి మాటలు మాత్రమే వినేవారని, అలాగే మోదీ కేవలం అమిత్ షా, అదానీ మాటలే వింటున్నారని ఆరోపించారు. లంకను హనుమంతుడు కాల్చలేదని, రావణుడి అహంకారమే ఆ లంకను తగలపెట్టిందని, ప్రధాని మోదీ అహంకారం వల్ల దేశం తగలబడిపోతోందన్నారు. లోక్‌సభ ఎంపీగా తనను మళ్లీ నియమించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.