లఖింపూర్ ఖేరి ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఊపిరి సలపకుండా చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఘటనా స్థలాన్ని సందర్శించటంతో పాటు, బాధిత కుటుంబాలను కలిసి తీరాల్సిందేనని యోగి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. రాహుల్ లక్నో విమానాశ్రయంలో బైటాయించటంతో హైడ్రామా జరిగింది. ఘటనా స్థలం వెళ్లేందుకు యుపి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అడిషనల్ డిజి ప్రశాంత్ కుమార్ ప్రకటించినా రాహుల్ ను విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి చర్చోప చర్చల అనంతరం యుపి ప్రభుత్వం లఖింపూర్ ఖేరి వెళ్లేందుకు రాహుల్ గాంధికి సాయంత్రం అనుమతి ఇచ్చింది. సాయంత్రం ఐదుగురు సభ్యులతో కూడిన బృందంతో కలిసి రాహుల్ తికోనియా సందర్శించారు. రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని, ఛత్తీస్ ఘడ్ సిఎం భూపేష్ భాగేల్, పార్టీ నేతలు కేసి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాల ఉన్నారు.
అంతకు ముందు లక్నోవిమానాశ్రయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు లఖింపూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు వేర్వేరుగా సాయం ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రం తరపున బాధిత కుటుంబాలకు తలా 50 లక్షల చొప్పున ఇస్తున్నట్టు పంజాబ్ సిఎం తెలిపారు. ఛత్తీస్ ఘడ్ సిఎం భూపేష్ భాగేల్ కూడా తల 50 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. దుర్గటనలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి కూడా రెండు రాష్ట్రాలు వేర్వేరుగా 50 లక్షల చొప్పున సాయం ప్రకటించాయి.
మరోవైపు లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి బిజెపి అధిష్టానం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర తేని ని వివరణ తీసుకుని, అక్షింతలు వేసినట్టు సమాచారం. ఈ రోజు ఢిల్లీ లో హోం మంత్రి అమిత్ షా తో అజయ్ మిశ్ర సమావేశమయ్యారు. లఖింపూర్ ఖేరి ఘటన కారణాలని అమిత్ షా కు వివరించారు.