Friday, March 28, 2025
HomeTrending Newsరాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధి పోటీ

రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధి పోటీ

అమేథి, రాయ్‌బరేలి స్థానాల ఉత్కంట వీడింది. కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరున్న ఈ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. రాయ్‌బరేలి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, అమేధీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్‌ శర్మలు బరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ వేదికగా జాబితాను విడుదల చేసింది. ఈ రెండు స్థానాల్లో నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.

బిజెపి తరపున రాయ్ బరేలి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ మాజీ ఎంఎల్‌సీ దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ యూపీ ప్రజలకు చిరపరిచితుడే. ఆయన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి అభ్యర్థి ఎవరైనా గెలుపు తనదేనంటూ దినేష్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల నుంచే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే పరంపర సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కొనసాగిస్తూ వస్తున్నారు. గత పర్యాయం రాహుల్ గాంధీ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అమేథీలో ఓటమి పాలయ్యారు. రెండు స్థానాల్లో పోటీ చేయగా రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. వాయనాడ్ నుంచి రెండోసారి బరిలో దిగారు.

వాయనాడ్‌కు రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నికలు పూర్తయ్యాయి. అమేథీ నియోజవర్గానికి ఐదో విడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి. ప్రియాంక రాయబరేలి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపినట్టు విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్‌లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు ఉభయ సభల్లో ఉండటాన్ని రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదని తెలిసింది. కుటుంబ పార్టీ ముద్ర నుంచి బయట పడాలంటే ప్రియాంక ఈ సారి పోటీలో ఉండకూడదనేది రాహుల్ ప్రతిపాదన అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

రాయ్ బరేలి నుంచి పోటీ చేయటం రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోయినా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. రాహుల్ పోటీ చేస్తే ఉత్తరాది నేతల్లో ఉత్సాహం రావటంతో పాటు ఉత్తరప్రదేశ్ లో పార్టీ పునరుజీవనానికి సహకరిస్తుందని పార్టీలో చర్చ జరిగింది.

యుపిలోని 80 లోక్ సభ సీట్లకు గాను ఎస్పి, కాంగ్రెస్ ల మధ్య కుదిరిన పొత్తుల్లో కాంగ్రెస్ కు 17 స్థానాలు కేటాయించగా మిగతా వాటిలో సమాజవాది పార్టీ పోటీ చేస్తోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్