పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చల్లార్చేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ రోజు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ లో భేటి అవుతున్నారు. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ – నవజ్యోత్ సింగ్ సిద్దు మధ్య విభేదాలతో పంజాబ్ కాంగ్రెస్ లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఇద్దరు కుమారులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎమ్మెల్యేల కొడుకులకు పోలీస్ ఇన్స్పెక్టర్, తహశీల్దార్ ఉద్యోగాలు ఇవ్వటం, విమర్శలు రావటంతో ఉద్యోగాల్ని వారు వదులుకోవటం పంజాబ్లో చర్చనీయంశంగా మారింది. దీనికి తోడు ఇసుక మాఫియాకు సిఎం అండగా ఉన్నారని సిద్దు ఆరోపణలు చేశారు. పార్టీ నేతలే ప్రభుత్వంపై విమర్శలు చేయటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇటీవల ముగ్గురు సభ్యులతో కమిటీ వేసినా నేతల మధ్య సఖ్యత కుదరలేదు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, మంత్రి మాన్ ప్రీత్ సింగ్ బాదల్ పంజాబ్ లో తాజా రాజకీయ పరిస్థితిని రాహుల్ గాంధికి నివేదించారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ హరీష్ రావత్ మరో నివేదికను రాహుల్ కు సమర్పించారు. ఎమ్మెల్యేల కుమారులకు ఉద్యోగాలు ఇవ్వటంలో సిఎం అమరిందర్ కు ఎవరో తప్పుడు సలహా ఇచ్చారని జాఖడ్ అన్నారు. తొందరలోనే పంజాబ్ కాంగ్రెస్ నేతల్లో అపోహలు తొలగి ఎన్నికలకు సన్నద్ధం అవుతామని పంజాబ్ పిసిసి అధ్యక్షుడు ఆశాబావం వ్యక్తం చేశారు.
నవజ్యోత్ సింగ్ సిద్దుకు పార్టీలో ముఖ్య భూమిక ఇవ్వటం ద్వారా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టెక్కుతుందని మెజారిటి నేతలు అధిష్టానానికి కొద్ది రోజులుగా విన్నవిస్తున్నారు. ఈ రోజు మరోసారి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని రాహుల్ నిర్ణయం తీసుకోనున్నారు.