కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు సూరత్ వెళ్లనున్నారు. పరువునష్టం కేసులో తనకు మెట్రోపాలిటన్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేయనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సూరత్‌లోని సెషన్స్‌కోర్టులో అప్పీలు దాఖలు చేయనున్నారు. తనని దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని ఆయన వ్యాజ్యంలో కోరనున్నట్లు సమాచారం. అంతేకాదు సెషన్స్‌కోర్టు తీర్పు ఇచ్చే వరకూ ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కూడా రాహుల్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దొరుకుతుందని ఆయన పిటిషన్‌లో కోరే అవకాశం కనిపిస్తోంది.
Defamation Case: సూరత్ కోర్టుకు రాహుల్ గాంధి
ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తన లీగల్ టీమ్‌తో కలిసి సూరత్ కోర్టుకు రాహుల్ చేరుకుంటారని న్యాయవాది కిరిట్ పన్వాలా తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ, లాయర్ అభిషేక్ మను సింగ్వీ నేతృత్వంలోని లీగల్ టీమ్ ఈ కేసు బాధ్యతలు చేపట్టింది. సీనియర్ అడ్వొకేట్ ఆర్ఎస్ చీమా రాహుల్ తరపున వాదనలు వినిపించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ సూరత్ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
Also Read : BY Election: రాహుల్‌గాంధీకి నెలరోజుల సమయం