Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకర్ణాటక కాంగ్రెస్ మెడకు రాహుల్ చుట్టిన హిజాబ్

కర్ణాటక కాంగ్రెస్ మెడకు రాహుల్ చుట్టిన హిజాబ్

Hijab Controversy in Karnataka: రాజకీయమంటే రాజకీయమే. దేన్నయినా రాజకీయం చేయాల్సిందే. దేన్నయినా రాజకీయానికి వాడుకోవాల్సిందే. సున్నితమయిన అంశాలు రగిలి దావానలంలా రాజుకుని సమాజం మాడి మసైపోయినా రాజకీయం చేయాల్సిందే. మంచి- చెడుల చర్చ జానేదో. ఈ క్షణాన అగ్గికి ఆజ్యం పోశామా లేదా అన్నదే ప్రధానం.

కాంగ్రెస్ అధినాయకుడు, దేశానికి ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ తెలిసి తప్పులో కాలేస్తారో లేక అసంకల్పితంగా బి జె పి ట్రాప్ లో పడుతున్నారో తెలియదు కానీ… స్వీయ గతానుభవాల నుండీ కూడా ఆయన ఏమీ నేర్చుకుంటున్నట్లు లేరు.

దక్షిణాదిలో బి జె పి కి స్వాగత ద్వారం కర్ణాటక. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లలో కనుచూపు మేరలో బి జె పి కి చోటు దొరికే అవకాశం లేదు. తెలంగాణాలో కొంత అవకాశం కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ రక్తం ప్రవహించని సిద్దరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ ను ఎంతగా నిర్వీర్యం చేశారో లోకానికి తెలుసు. అల్ప సంఖ్యాక, హిందూ, దళిత మాటల్లో మొదటి అక్షరాలను తీసుకుని “అహింద” అని ఒక సరికొత్త హిందూ వ్యతిరేక ధ్వనితో సామాజిక భావనకు సిద్దరామయ్య ప్రాణం పోసినప్పుడే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రాణం పోయింది. ముస్లిముల కోసం తప్ప హిందువుల కోసం తాము ఏమీ చేయలేమని సిద్దరామయ్య తన మాటల ద్వారా చేతల ద్వారా ప్రకటించిన ప్రతిసారీ బి జె పి రొట్టె విరిగి నేతిలో పడేది. బి జె పి కి రాష్ట్రాన్ని చేజేతులా అప్పగించి సిద్దరామయ్య గద్దె దిగారు. ఇప్పుడు కర్ణాటక పి సి సి అధ్యక్షుడు డి కె శివ కుమార్ ఘటికుడు. కర్ణాటకలో బి జె పి ఎత్తుగడలను పసిగట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేయగల సమర్థుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా బలం పుంజుకుంది. బి జె పి యెడ్యూరప్పను ఎలాగో దించి బసవరాజ్ బొమ్మాయ్ ను ముఖ్యమంత్రి కుర్చీలో బొమ్మగా కూర్చోబెట్టినా ఎందుకో రాజకీయ సమీకరణలు సరిగ్గా కుదురుకోలేదు.

ఇలాంటివేళ కర్ణాటకలో బి జె పి సహజంగా ఇతరేతర భావోద్వేగ విషయాలను రాజేస్తుందన్న ఎరుక కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఉండాలి. సిద్దరామయ్య శిథిలం చేసి వెళ్లిన కాంగ్రెస్ కంచు కోటకు ఒకవైపు డి కె శివకుమార్ అతుకులు పెడుతుంటే మరోవైపు రాహుల్ గాంధీ చిల్లులు పెడుతున్నట్లున్నారు.

ముస్లిం అమ్మాయిలు తలను కప్పి ఉంచే వస్త్రం “హిజాబ్” ధరించడం వారి సంప్రదాయంలో భాగం. స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు యూనిఫార్మ్ ఉన్నా…ఆ యూనిఫార్మ్ మీదే హిజాబ్ వేసుకుంటారు. కర్ణాటక బి జె పి ప్రభుత్వానికి ఇందులో రాజకీయ ప్రయోజనం కనిపించింది. అంతే వెంటనే విభజన సూత్రం అగ్గి రాజుకుంది.

1 . ముస్లిం అమ్మాయిలు హిజాబ్ వేసుకోవడానికి వీల్లేదు.

2 . మీకు హిజాబ్ తప్పనిసరి అయితే వేసుకోండి. అలాంటప్పుడు హిందువుల పిల్లలు కాషాయ రంగు ఉత్తరీయం కానీ, కండువా కానీ వేసుకుంటారు.

అని రెండు వాదనలను చర్చలోకి తెచ్చింది. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు రెండుగా చీలిపోయారు. అవును వారు అది వేసుకుంటే…వీరు ఇది వేసుకోవడం న్యాయమే కదా అని ఒక వర్గం; చదువుల దగ్గర అనవసరంగా ఈ వివాదం ఏమిటని మేధావులు; ముస్లిములను చదువుకు దూరం చేస్తున్నారని సెక్యులరిస్టులు…మూడు వర్గాలు కొట్టుకుని చస్తున్నాయి. రాహుల్ గాంధీ దయవల్ల సమస్య కర్ణాటక దాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్లింది.

ముస్లిములను చదువులకు దూరం చేసే బి జె పి కుట్ర ఇది అని రాహుల్ గాంధీ ట్విట్టడంతో జాతీయ, అంతర్జాతీయ లెఫ్ట్ వింగ్ మేధావులందరూ గుండెలు బాదుకుంటూ వలవల విలపిస్తున్నారు.

సరిగ్గా…బి జె పి కోరుకున్నది ఇదే. హిజాబ్ అన్న మాటే ఇన్ని శతాబ్దాల్లో వినని సమాజానికి ఇప్పుడు తెలియాలి. ముస్లిం హిజాబ్ ను అనుమతించినప్పుడు…హిందూ ఉత్తరీయాన్ని, కండువాను కూడా అనుమతించాలి కదా అన్న ప్రశ్నపై వీలయినంత విస్తృతంగా చర్చ జరగాలి. కొండకు వెంట్రుక వేసిన సామెతలా…ఈ దెబ్బకు హిజాబ్ అయినా పోవాలి. లేదా ఉత్తరీయమయినా రావాలి. అటయినా…ఇటయినా…ఇందులో గెలిచినా…ఓడినా…బి జె పి కే లాభం.

Hijab Issue

దేశంలో ఇంకే సమస్యలే లేనట్లు కాంగ్రెస్ రాహుల్ ఈ హిజాబ్ వస్త్రాన్ని భుజాన వేసుకున్నారు. డి కె శివకుమార్ లు బి జె పి, ఈడి, ఐటి, సిబిఐ లకు ఎంతగా ఎదురొడ్డి పోరాడుతున్నా నెత్తిన గుడ్డ వేసుకోవడానికే కాంగ్రెస్ తహతహలాడుతూ ఉంటుంది.

“మేము 80 శాతం వైపు- మీరు 20 శాతం వైపు” అని బి జె పి బహిరంగంగా చెబుతుంటే…కాంగ్రెస్ కూడా అవును మేము 20 శాతం వైపే అని సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ఉంటుంది.

కర్ణాటకలో పెరిగిన కాంగ్రెస్ బలాన్ని అర్జంటుగా ఎలా తగ్గించుకోవాలో అని రాహుల్ గాంధీ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నారు. కర్ణాటక కాంగ్రెస్ మెడకు రాహుల్ చుట్టిన హిజాబ్ ను విడిపించుకోవడానికి ఎందరు శివకుమార్ లు ఎన్నేళ్లు కష్టపడాలో?

రాజకీయాల్లో హత్యలు ఉండవు.
ఆత్మహత్యలే ఉంటాయి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

హిందూ – హిందుత్వవాదం వేరు వేరట!

Also Read :

ఇచ్చట వ్యూహాలు అమ్మబడును

RELATED ARTICLES

Most Popular

న్యూస్