Rahul Gandhi Hindu Comments:
కంచె ఐలయ్య రాసిన “నేను హిందువును ఎట్లయిత?” పుస్తకం ఇంగ్లీషు వర్షన్ ను కాంగ్రెస్ అధినాయకుడుకాని అధినాయకుడు చదివి ఉంటారు. లేక తెలుగు వర్షన్ సారాన్నే కాంగ్రెస్ తెలుగు నాయకులెవరయినా రాహుల్ కు విడమరచి చెప్పి ఉంటారు. కీలకమయిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముంగిట్లో హిందు- హిందుత్వ అంశాన్ని ఎత్తుకుని రాహుల్ బి జె పి ట్రాప్ లో పడుతున్నట్లు కనిపిస్తోంది.

రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి. హిందుత్వ అంశాలు ఎంతగా చర్చకు వస్తే బి జె పి కి అంతగా అడ్వాన్టేజ్. ప్రత్యర్థులు బి జె పి నెత్తిన పాలు పోసినట్లు. జాతీయత, హిందుత్వ భావోద్విగ్న అలలపై బి జె పి ఎన్నికల నావలు సునాయాసంగా విజయతీరాలకు చేరుతూ ఉంటాయి. ప్రత్యర్థుల పడవల్లో అనేక సెల్ఫ్ గోల్స్ చిల్లులు పడి…ఓటి పడవల్లో ఓట్లు పడక నీట మునిగి గల్లంతవుతూ ఉంటాయి. ఈ ఆధునిక ఎన్నికల సూత్రం రాకెట్ సైన్సేమి కాదు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తప్ప అందరికీ ఈ సూత్రం తెలుసు. తెలంగాణాలో బి జె పి హిందుత్వ అజెండాను మించి అధికార టి ఆర్ ఎస్ భక్తి పారవశ్యంలో మునిగి తేలడానికి ఈ సూత్రమే అంతస్సూత్రం. ఓట్లు పడతాయంటే రాజకీయ పార్టీలు దేవుడికే కాదు…మనుషులక్కూడా పూజలు చేస్తాయి.

మిగతా పార్టీల సంగతి పక్కనబెడితే కాంగ్రెస్ ప్రస్తుతం ఏ దశలో ఉందో దానికీ తెలియదు…దేశానికీ తెలియదు. నిజానికి కాంగ్రెస్ అవసరం దేశానికి ఎంతో ఉంది. కానీ కాంగ్రెస్ కే దేశంతో అవసరం ఉన్నట్లు కనిపించడం లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు…కాంగ్రెస్ తనతో తానే కొట్లాడుకుంటూ ప్రత్యర్థితో కొట్లాడ్డం ఎప్పుడో మరచిపోయింది. ప్రపంచం పట్టనంత చరిత్ర ఉన్న ఆ పార్టీకి ఫుల్ టైమ్ అధ్యక్షుడు ఉన్నట్టో? లేనట్టో? ఆ రథానికి ఏ నట్టు లేనట్టో? చెప్పగలిగిన రాజకీయ మేధావి లేడు. ఉన్నా చెప్పలేడు.  అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ…నువ్వే దిక్కు అని పార్టీ క్యాడర్ మొక్కుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ ఏమో అహం న జానామి అధికారం…అహం న జానామి అధ్యక్షత్వం…అని విల్లమ్ములు పడేసి…కాడి వదిలేసి…కురుక్షేత్ర యుద్ధ సీమ మధ్య విషాదయోగంతో కూడిన వైరాగ్య యోగంలోకి దిగిన అర్జునుడిలా దిక్కులు చూస్తూ ఉంటాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్యమ్ బోధించాడు. రాహుల్ కు కర్తవ్య గీత చెప్పే కృష్ణుడు దొరుకుతాడని ఆయన చేతిలో గీత రాసిపెట్టి ఉందో? లేదో? తెలియదు.

తాజాగా రాహుల్ గాంధీ ఒక వివరణ ఇచ్చుకున్నారు. “నేను హిందువునే…కానీ హిందుత్వవాదిని కాను” అన్నది ఆ వివరణ సారాంశం. దేశానికి ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ కు ఇలాంటి వివరణలు ఇవ్వాలని ఎవరు సలహా ఇస్తున్నారో? వారికి బి జె పి మోడీ- అమిత్ షాలు జీవితాంతం రుణపడి ఉండాలి. లేదా హిత శత్రువుల సంఖ్య పెరిగి…కోవర్ట్ ఆపరేషన్లను రాహుల్ గుర్తించలేని స్థితిలో అయినా ఉండి ఉండాలి.

వేదాల్లో ఎక్కడా “హిందు” అన్న ప్రస్తావనే లేదు. సనాతన ధర్మం, ఆర్ష ధర్మం, రుషి మార్గం అనే ఉంటుంది. మధ్యలో ఎప్పుడో సింధు…హిందు ప్రస్తావన వచ్చి ఉంటుంది. స్థూలంగా హైందవ ధర్మాన్ని పాటించేవారందరూ హిందువులే అవుతారు. హిందూకు సంబంధించినది “హిందుత్వం” అవుతుంది. అంటే వ్యాకరణం ప్రకారం చివర త, త్వం చేరి భావార్థకం అవుతుంది. ఆ భావన వైపు నిలబడేవారు హిందుత్వ వాదులు అవుతారు.

రాహుల్ గాంధీ చెబుతున్న ప్రకారం… ఆయన హిందువే. హిందుత్వవాది కానే కాదు. అదేదో సినిమాలో పెళ్లి కొడుకు ఇతడే…కానీ అతడు వేసుకున్న కోటు మాత్రం…అన్నట్లు రాహుల్ వివరణ సెల్ఫ్ గోల్లా ఉంది.

హిందుత్వ వాది కాకుండా హిందువుగా ఉన్న రాహుల్ ను హిందువులూ దూరం పెట్టి… హిందుత్వవాదిని కానంటూనే హిందువుగా ఉన్నావు కదా అని మిగతా వారూ దూరం పెట్టే ప్రమాదం ఉంది. రాహుల్ ఉద్దేశం ఇదే అయి ఉంటే…మోడీ అమిత్ షాల నెత్తిన రాహులే అమూల్ పాలు పోసినట్లు!

అది కానప్పుడు ఇలాంటి సున్నితమయిన…రెండంచుల కత్తి లాంటి విషయాలను ఎలా ప్రయోగించాలో? కె సి ఆర్ లాంటివారిని చూసి నేర్చుకోవాలి.

లేదంటే…రాహుల్ అక్షరాలా ఆయనే చెప్పుకున్నట్లు హిందువుగానే ఉన్నా హిందుత్వానికి ఎప్పటికీ దూరంగా ఉండాలి. హిందుత్వ శిబిరం ఏమి కోరుకుంటోందో…అదే చేస్తూ ఉండిపోవాలి.

అన్నట్లు-

రాజకీయాల్లో హత్యలుండవు.

అన్నీ ఆత్మహత్యలే!

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *