ఒక అడుగు జన ప్రభంజనమైంది… ఒక అడుగు జన చేతనమైంది. భారత్ జోడో అనే అడుగు జాతి సమైక్య నినాదమైంది. ఒక్కటిగా కదిలి.. వేలు.. లక్షలు.. కోట్ల భారతీయుల్లో జన వాహినిగా మారింది. అదే రాహుల్ గాంధి జన చైతన్య కవాతు.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతున్న రాహుల్ యాత్ర దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో జన ఘోషలో జాతి గుండె చప్పుడైంది. రాహుల్ కవాతు ఏకంగా జాతియగీతంలా భారత్ జోడో అనే మరో స్వాతంత్య్ర ఉద్యమమైంది. భారత్ జోడో యాత్ర 54 రోజు తెలంగాణలో 7వ రోజుగా హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ కు చేరుకుంది. ఇక్కడి కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధితోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రదాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉదయం ఆరు గంటలకే శంషాబాద్ నుండి ప్రారంభమైన యాత్ర చార్మినార్, గాంధిభవన్, నాంపల్లిల మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంది. దారి పొడవునా స్వాగత తోరణాలు, భారీగా జన సందోహం నడుమ రాహుల్ పాదయాత్ర జనసంద్రంగా మారింది. ఎక్కడికక్కడ రాహుల్ ని స్వాగతించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావటంతో కొన్ని ప్రాంతాల్లో భద్రత కూడా కష్టతరంగా మారింది. అయినా మొక్కవోని ధైర్యంతో రాహుల్ ఎక్కడికక్కడ అభిమానులు, కార్యకర్తలను చిరునవ్వుతో పలకరిస్తూ అభివాదం చేస్తూ కార్నర్ మీటింగ్ కు చేరుకున్నారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ.. జాతి సమైక్యత, జాతి శాంతి సౌబ్రాతృత్వంతో ముందుకు సాగుతున్న వైనాన్ని రాహుల్ వివరించారు. ఇక్కడ దొరల పాలన, అక్కడ మత శక్తుల దౌర్జన్యాలు. సమైక్యవాద దేశాన్ని ముక్కల చేస్తున్న బీజేపీ పాలనకు ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలో అత్యంత కాలుష్యం డిల్లీలో ఉంది. కానీ.. ఇప్పుడు దేశంలో అత్యంత కాలుష్యం హైదరాబాద్ లో ఉంది. కారణం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉంది.
మోడి, కేసీఆర్ నడుమ డైరెక్ట్ లింక్ ఉంది. దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు శూన్యం. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. లక్షలాది నిరుద్యోగులు ఫుడ్ డెలివరీ బాయ్స్ గా ఉన్నారు. ఇదేనా దేశ అబివృద్ధి. దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నీ మోడి స్నేహితులకు వెళ్లిపోయాయి. బ్యాంకుల నుండి లక్షల కోట్లు మోడి తన స్నేహితులకు దోచిపెడుతున్నారు. గ్యాస్ సిలిండర్ నాలుగు వందలు ఉండేది 11 వందలు అయ్యింది. పెట్రోల్ ఎంతైంది. ఒకవైపు దోచుకోవటం మరొవైపు సామాన్యుల నడ్డి విరచటం మోడికి సర్వసాదారణం. అందుకే భారత్ జోడో యాత్ర ప్రారంభించాను. దేశ సమైక్యత కోసం యాత్ర సాగుతుంది. మీ ప్రేమ, మీ ఆదరణతో నేను ముందుకు సాగుతున్నానని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన 56 రోజులుగా సాగుతున్న భారత్ జోడో యాత్రలో అతిపెద్ద నగరం హైదరాబాద్ కావటంతో భారీగా ప్రజలు తరలివచ్చి రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. జన తరంగంలో రాహుల్ గాంధీ యాత్ర రాత్రి విడిదికి చేరుకుంది.
Also Read : మోడి, కేసీఆర్ నడుమ డైరెక్ట్ లింక్ – రాహుల్ గాంధీ