Saturday, January 18, 2025
HomeTrending Newsపెరంబదూర్‌లో రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళి

పెరంబదూర్‌లో రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళి

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఈ యాత్రను ప్రారంభించబోతున్న రాహుల్ గాంధీ… నేడు ఉదయం 7గంటలకు చెన్నై సమీపంలోని పెరంబదూర్‌లోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. స్మారక చిహ్నం వద్ద రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ రంగ ప్రవేశం తర్వాత రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

భారత్ జోడో యాత్ర నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3.05 గంటలకు తీరువల్లూర్ మెమోరియల్ ను రాహుల్ సందర్శిస్తారు. 3.25గంటలకు కామరాజ్ మెమోరియల్‌ను సందర్శించి, సాయంత్రం 4.10గంటలకు మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో జాతీయ జెండా అందజేత కార్యక్రమంలో భాగంగా తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ రాహుల్ కు జాతీయ జెండాను అందిస్తారు. 4.40 గంటలకు భారత్ జోడో యాత్రికులతో కలిసి మహాత్మా గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు జరిగే మార్చ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు కన్యాకుమారికి చేరుకొని భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ యాత్ర ప్రారంభంలో భాగంగా తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ సీఎంలు  పాల్గొననున్నారు.

ఇదిలా ఉండగా భారత్ జోడో పాదయాత్ర మాత్రం గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి దాదాపు ఆరు నెలల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పాదయాత్ర చేపట్టడం ఇదే తొలిసారి. 12 రాష్ట్రాల్లో సాగనున్న ఈ యాత్ర  3,570 కిలో మీటర్ల మేర 150 రోజులు జరగనుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ తెల్లటి దుస్తులు ధరిస్తారు. రాహుల్ వెంట ఆయా ప్రాంతాల్లో రెండు బ్యాచ్ లలో ప్రతిరోజూ 22 నుంచి 23 కిలో మీటర్లు పాల్గొంటారు. రాహుల్ గాంధీ తన పాదయాత్ర సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రాథమిక వసతులతో కంటైనర్లను ఏర్పాటు చేసారు. రాత్రి సమయంలో రాహుల్ కంటైనర్లలో బస చేస్తారు.

 Rahulgandhi Sriperumbudur

రాహుల్‌ గాంధీ పాదయాత్రకు నిత్యం 3 షిఫ్టుల్లో పోలీసు బలగాలు భద్రత కల్పించనున్నాయి. తమిళనాడులో 2,500 మంది పోలీసుల్ని ఈ విధుల్లో నియమించారు. యాత్ర తొలి 4 రోజులు తమిళనాడులో కొనసాగనుంది. 11వ తేదీన కేరళలోకి ప్రవేశిస్తుంది.  ఈ యాత్రలో రాహుల్ తో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్‌ నేతలు పాల్గొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్