కొత్త రైల్వే లైను ఇవ్వకుండా, రైల్వే లైన్లకు తగినన్ని నిధులు కేటాయించకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రధాన నగరాలకు బుల్లెట్ రైలు ప్రస్తావన లేకుండా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేకుండా, కాజీపేట వ్యాగన్ల తయారీ కేంద్రానికి ఎంత భూమి అవసరం..?, అందులో ఎంతమందికి కొత్త ఉద్యోగాలు ఇస్తారో..?, దానికి ఎన్ని నిధులు మంజూరు చేయనున్నారో..? స్పష్టత ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసిందని, రైల్వే అంశంలో రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం చీకట్లోకి నెట్టేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కాజీపేట వ్యాగన్ వ్యాగన్ల తయారీ కేంద్రానికి ఎంత భూమి అవసరం ఉందో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదని, ఈ విషయాన్ని చెబితే అందుకు అవసరమైన భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వినోద్ కుమార్ తెలిపారు.
అయితే వ్యాగన్ల తయారీ కేంద్రం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇవ్వనుందో స్పష్టం చేయాలని, ఎంత మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వనున్నారో కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని వినోద్ కుమార్ కోరారు.
రామగుండం – మణుగూరు రైల్వే లైన్ పనులను నిర్ణీత కాల పరిమితి విధించి పూర్తి చేయాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ పనుల కోసం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది ఈ మూలకు కూడా సరిపోదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రామగుండం – మణుగూరు రైల్వే లైన్ పనులు పూర్తయితే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అత్యంత కీలకమైన ఈ రైల్వే లైన్ పనులను దశాబ్ద కాలం నుంచి సాగదీస్తున్నారని అంటూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వినోద్ కుమార్ తప్పు పట్టారు.
తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ల ప్రస్తావనే లేకుండా పోయిందని, ఆన్ గోయింగ్ రైల్వే లైన్లకు తగినన్ని నిధులు ప్రకటించలేదని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ – ఆర్మూర్ – నిర్మల్ – ఆదిలాబాద్ రైల్వే లైన్ ఊసే లేకుండా పోయిందని వినోద్ కుమార్ అన్నారు.
సర్వే పూర్తయిన కాజీపేట – హుజూరాబాద్ – కరీంనగర్ రైల్వే లైన్ ను మంజూరు చేస్తారని ఆశించినా.. నిరాశే మిగిలిందని వినోద్ కుమార్ అన్నారు.
ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం మధ్య మూడవ రైల్వే లైన్ కోసం మాత్రమేనిధులు కేటాయించారని.. అయితే ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ కు కేటాయించినట్లు ఎలా అవుతుందని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కొచ్చిలకు బుల్లెట్ రైలు ప్రస్తావనను కేంద్ర ప్రభుత్వం చేయనేలేదని వినోద్ కుమార్ మండిపడ్డారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వలేమంటూ చెబుతూనే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్.. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాలలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రులు వారి రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను మంజూరు చేసుకుంటున్నారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పట్ల వివక్షత చూపుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.
దక్షిణ మధ్య రైల్వే ( ఎస్.సీ.ఆర్ ) కు నిధులు ఎక్కువ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అయితే వాస్తవ రూపంలో మాత్రం అవి గణాంకాలకే పరిమితం అయ్యాయని, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. బడ్జెట్ అనంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పింక్ బుక్ ద్వారా ఈ విషయం వెల్లడైందని వినోద్ కుమార్ తెలిపారు.
ఎం.ఎం.టీ.ఎస్. రైలు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు ఖర్చు భరిస్తోందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
Also Read : బడ్జెట్‌లో దేశాభివృద్ధికి నిధులు కనపడటంలేదు మంత్రి కేటీఆర్