Friday, June 12, 2026
HomeTrending Newsరైతుబంధుపై అక్కసు ఎందుకు - మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుబంధుపై అక్కసు ఎందుకు – మంత్రి నిరంజన్ రెడ్డి

డిసెంబరు 28 నుండి జనవరి 18 వరకు రైతుబంధు పథకం కింద నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దానికి అనుగుణంగా ప్రతి రోజు నిధులు రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతున్నదని వివరించారు. ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్న 54 లక్షల 70,637 మంది రైతుల ఖాతాలలో 4327.93 కోట్లు జమ చేయడం జరిగిందని వెల్లడించారు. రైతుబంధు పథకం నిధుల విడుదలపై ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు.

రైతుబంధు నిధులు జమ చేయడం ప్రారంభించి ఎనిమిది రోజులు అయ్యింది కాబట్టి ఎనిమిది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో పడాల్సిందే అని ఆంధ్రజ్యోతి ఊహించుకుని ఊహాజనిత కథనాలు రాసి రైతులను గందరగోళానికి గురిచేయాలనుకోవడం దురదృష్టకరమని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమచేసినట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏ రోజు ఎంత మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేశామో అదే మీడియాకు విడుదల చేయడం జరుగుతున్నదన్నారు.

నిధుల కొరత ఉన్నా, కేంద్రం వివిధ రకాలుగా తెలంగాణ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా, కరోనా విపత్తు వచ్చినా గత 9 విడతలుగా రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానిదని తెలిపారు. పదో విడత రైతుబంధు నిధులు కూడా విజయవంతంగా రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతున్నదని, అరకొర సమాచారం, ప్రభుత్వాన్ని బద్ నాం చేయాలన్న అత్యుత్సాహం సరికాదని హితవు పలికారు.

కనీస సమాచారం, వివరణ తీసుకోకుండా వార్తను ప్రచురించడం అంటే కేవలం ప్రభుత్వ పథకాల మీద బురదజల్లాలన్న ఆలోచన ఉన్నట్లు అర్దమవుతున్నదని మంత్రి మండిపడ్డారు. గత యాసంగి సీజన్ లో కూడా డిసెంబరు ఆఖరులో మొదలుపెట్టి సంక్రాంతి వరకు జమచేయడం జరిగిందని, ఈసారి కూడా గత యాసంగి మాదిరిగా రైతుబంధు నిధులు జమచేయడం జరుగుతున్నదని స్పష్టం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular