శ్రీలంకలో ద్రవ్యోల్భణం పెరుగుదలతో మొదలైన ధరల తుపాను రాజకీయ సంక్షోభానికి దారితీస్తోంది. దేశాధ్యక్షుడు గోటబాయ రాజపక్స రాజీనామా చేయాలని నిన్నటి వరకు కొలంబోకే పరిమితమైన ఆందోళనలు ఇప్పుడు దేశావ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ నిర్వాకం వల్లే దేశం సంక్షోభంలోకి కూరుకుపోతోందని దేశమంతటా యువత నిరసన ప్రదర్శనలు చేస్తుండగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారుతోంది. ప్రజాందోళనల నేపథ్యంలో ఆదివారం సిలోన్ మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. దీంతో తన పదవి కాపాడుకునేందుకు దేశాధ్యక్షుడు కొత్త ఎత్తుగడ వేశారు. కొత్త మంత్రివర్గంలో చేరాలని అధ్యక్షుడు రాజపక్స ప్రతిపక్ష పార్టీలకు లేఖ రాశారు.
దేశ ప్రయోజనాల కోసం, భావి తరాల అభ్యున్నతి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు రావాలని లేఖలో పేర్కొన్నారు. శ్రీలంక మంత్రివర్గంలో 26 మంది మంత్రులు ఒకేసారి రాజీనామా చేయటం సంచలనం కాగా ప్రధానమంత్రి మహింద రాజపక్సే మాత్రం పదవిలో కొనసాగుతున్నారు. ఈ రోజు కొత్త మంత్రివర్గం కొలువు దీరే అవకాశం ఉంది. మొత్తం ఐదుగురు రాజపక్స కుటుంబ సభ్యులు మంత్రివర్గంలో ఇప్పటివరకు ఉన్నారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స(రక్షణ మంత్రిగా), ప్రధాని మహీంద రాజపక్స, నీటి పారుదల శాఖమంత్రి చామల్ రాజపక్స, బసిల్ రాజపక్స, ప్రధాని మహీంద తనయుడు నమల్ రాజపక్స క్రీడాశాఖ మంత్రిగా ఉన్నారు. వీటితో పాటు ఇతర ప్రధాన పదవుల్లోనూ రాజపక్స కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉన్నారు.
మరోవైపు శ్రీలంక స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది.ఈ రోజు (సోమవారం) ట్రేడింగ్ మొదలైన క్షణాల్లోనే బ్లూ చిప్ సూచి 5.92 శాతం పతనం అయింది. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. అటు శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రల్ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినట్టు గవర్నర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Also Read : శ్రీలంకలో ఎమర్జెన్సీ