ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు విషయంలో ఆందోళన అవసరం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. విరాట్ కోహ్లి నేతృత్వంలో 20 మంది భారత క్రికెట్ టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డట్లు వచ్చిన వార్తలు భారత క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. వీరిలో ఒకరు ఇప్పటికే కోలుకున్నారని, మరొకరు అతి త్వరలో కోవిడ్ నుంచి కోలుకుని జట్టులో చేరతారని వార్తలు వచ్చాయి.
ఈ విషయమై శుక్లా స్పందిస్తూ, కోవిడ్ బారిన పడ్డ ఆటగాడి పేరు వెల్లడించబోమని, ఆ క్రికెటర్ టీమ్ కు దూరంగా బంధువుల ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నాడని, 8 రోజుల క్రితం జరిపిన పరీక్షలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలియజేశారు. మరో రెండ్రోజుల్లో మరోసారి ఆ ఆటగాడికి మరోసారి పరీక్షలు జరుపుతామని శుక్లా చెప్పారు. బిసిసిఐ కార్యదర్శి జై షా జట్టు మేనేజ్మెంట్ కు లేఖ రాశారని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారని శుక్లా తెలిపారు.
కోవిడ్ కు సంబంధించి ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆటగాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారని చెప్పారు. డబ్ల్యూ టి సి ఫైనల్ మ్యాచ్ కు, ఇంగ్లాండ్ సిరీస్ కు మధ్య 40 రోజుల వ్యవధి ఉందని, అంత కాలం పాటు వారిని బయో బాబుల్ లో పెట్టలేమని అందుకే వారిని పరిసర ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతించామని శుక్లా వివరణ ఇచ్చారు. మొత్తం సభ్యుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే కోవిడ్ వచ్చిందని, మిగిలిన వారికి ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. ప్రసుతం ఐసోలేషన్లో ఉన్న ఆటగాడు దుర్హాన్ లో జరిగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కు అందుబాటులో ఉండబోడని, తరువాత జట్టుతో జాయిన్ అవుతాడని శుక్లా వివరించాడు. అయితే కోవిడ్ బారిన పడి ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న ఆటగాడు రిషభ్ పంత్ అని తెలుస్తోంది.