Tuesday, September 24, 2024
Homeసినిమాభోగాల మధ్య యోగి... రజనీకాంత్

భోగాల మధ్య యోగి… రజనీకాంత్

Rajini.. a real Super Star:
సముద్రమన్న తరువాత కెరటాలు ఉంటాయి .. జీవితమన్న తరువాత కష్టాలు ఉంటాయి. కెరటాలు తగ్గిన తరువాత ప్రయాణం చేయాలనుకోవడం ఎంత అమాయకత్వమో
.. కష్టాలు లేని జీవితం కోసం ఎదురు చూడటం కూడా అంతే అమాయకత్వం. జీవితమంటేనే పోరాటం .. ఆత్మవిశ్వాసంతో పోరాడినవారికే విజయం దాసోహమవుతుంది. అలాంటివారికే చరిత్రలో చోటు దొరుకుంది. అశేష ప్రజానీకం హృదయాలలో శాశ్వతమైన స్థానం దక్కుతుంది. అలాంటి స్థానాన్ని దక్కించున్న అరుదైన కథానాయకుడిగా రజనీకాంత్ కనిపిస్తారు.

ఎవరి తెలివి తేటలైనా తాము ఎందుకు పనికి వస్తామో గ్రహించి, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం పైనే ఆధారపడి ఉంటాయి. జీవితంలో ఎవరి ఏ పని చేసినా అది కాలంతో ముడి పడి ఉంటుంది. ఆ తరువాత ఆ పని చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. అలా కాలంతో పాటు పరిగెత్తిన వాళ్లు మాత్రమే, కొన్ని కాలాలపాటు తమ గురించి చెప్పుకునేలా చేయగలుగుతారు. తరువాత తరాలవారికి ఆదర్శంగా నిలవగలుగుతారు. అలా తన కీర్తి పతాకను జనం గుండెలపై ఎగరేసిన దళపతిగా రజనీకాంత్ నిలిచారు.

రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబర్ 12 వ తేదీన కర్ణాటకలో జన్మించారు. స్కూల్ డేస్ లోనే రజనీకాంత్ కి నాటకాల పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. చదువు పూర్తి చేసిన తరువాత బస్సు కండక్టర్ గా  ఆయన తన జీవితాన్ని మొదలుపెట్టారు. రజనీకాంత్ మాట తీరు .. ఆయన నడక .. ఆయన టికెట్లు కొట్టే పద్ధతి చాలా స్టైల్ గా ఉండేదట. అది గమనించిన ఆయన స్నేహితుడు, సినిమాల్లో ట్రై చేయడం వలన మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి, కొంత డబ్బు ఇచ్చి మరీ చెన్నై కి పంపించాడట.

ఇక చెన్నై వెళ్లిన తరువాత ఎవరిని కలుసుకోవాలో .. ఏం చేయాలో తెలియని రజనీ, తలదాచుకోవడానికి ఒక రూమ్ ని సంపాదించుకోవడానికే  నానా కష్టాలు పడ్డారు. ఆ తరువాత సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అదే సమయంలో అప్పటికే తమిళ ఇండస్ట్రీలోని హీరోలు .. వాళ్ల బాడీలాంగ్వేజ్ .. వాళ్లలోని ఏ ప్రత్యేకత కారణంగా అభిమానులు ఈలలు .. చప్పట్లు కొడుతున్నారనేది ఆయనకి అర్థమైపోయింది. తనకి అవకాశం వస్తే మాత్రం వాళ్లకి భిన్నంగా చేయాలనే ఒక ఆలోచన ఆయన మదిలో మెదిలింది.

అలా మొత్తానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి, ‘అపూర్వరాగంగళ్’ సినిమా ద్వారా తమిళ తెరకి పరిచయమయ్యారు. తొలి సినిమానే ఆయన కమల్ హాసన్ తో కలిసి చేయడం విశేషం. ఆ తరువాత వాళ్లు కలిసి సాగించిన ప్రయాణం .. సాధించిన విషయాలను చూసుకుంటే, ఇది చాలా అరుదైన సంఘటనగా .. గమ్మత్తుగా అనిపిస్తుంది. అదృష్టవంతుడికి ఆకాశంలో కూడా పట్టు దొరుకుంతుందన్నట్టుగా రజనీకి బాలచందర్ దొరికారు. రజనీ ..  కమల్ నటన పరంగా భిన్న ధృవాలు. అందువలన వాళ్లిద్దరితో కలిసి బాలచందర్ ప్రయోగాలు చేశారు. అది వాళ్ల కెరియర్ కి బాగా కలిసొచ్చింది.

రజనీకాంత్ పెద్ద గ్యాప్ లేకుండానే తెలుగు ..  కన్నడ భాషలకి కూడా హీరోగా పరిచయమయ్యారు. తెలుగులో ఆయన మల్టీ స్టారర్ అనదగిన సినిమాలు చేశారు. బాలీవుడ్ కి మాత్రం ‘అంధాకానూన్’ సినిమా ద్వారా పరిచయమయ్యారు. హిందీలో తన తొలి సినిమానే ఆయన అమితాబ్ తో కలిసి పని చేయడం విశేషం. ఆ తరువాత అడపాదడపా హిందీ సినిమాలు కూడా చేస్తూ వెళ్లారు. తమిళంలో పూర్తిస్థాయిలో బిజీ అయిన తరువాత మాత్రం ఇతర భాషల్లో నటించే తీరిక లేకుండా పోయింది. తమిళ ఇండస్ట్రీకి రజనీ .. కమల్ రెండు కళ్లుగా మారిపోయారు.

కమల్ అసమానమైన తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటే,  రజనీ మాత్రం తన స్టైల్ తోనే ప్రేక్షకుల మనసులను కట్టిపడేశారు. తన డైలాగ్స్ లో కొటేషన్స్ ఉండేలా చూసుకుంటూ, ప్రేక్షకులను హుషారెత్తించాడు. ‘అతిగా ఆశపడే మగవాడు .. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టుగా చరిత్రలో లేదు’ .. ‘కష్టపడందే ఏదీ రాదు .. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు’ .. ‘ నా దారి రహదారి .. అడ్డు రాకండి’ .. వంటి డైలాగ్స్ ఆయన సినిమాల్లో ఎన్నో కనిపిస్తాయి. తనదైన స్టైల్ తో ఆయన చెప్పే ఆ డైలాగ్స్ జీవితసత్యాలుగా ప్రేక్షకుల వంటికి పట్టేశాయి.

దళపతి .. బాషా .. అరుణాచలం .. నరసింహా .. చంద్రముఖి .. రోబో రజనీ క్రేజ్ ను పతాకస్థాయికి తీసుకెళ్లిన సినిమాలుగా కనిపిస్తాయి. ఒకదానికి మించి ఒకటి సంచలన విజయాలను సాధించిన ఆ సినిమాలు, అరుదైన రికార్డులను సెట్ చేసి పెట్టాయి. సౌత్ లో రజనీ సినిమా విడుదలవుతుందంటే , మిగతా భాషల్లోని స్టార్ హీరోలంతా ఆ దగ్గరలో తమ సినిమాల రిలీజ్ లేకుండా చూసుకుంటారు. దీనిని బట్టి ఆయనకున్న క్రేజ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. తన నటనకు కొలమానంగా  పద్మభూషణ్ .. పద్మవిభూషణ్ .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ఆయన అందుకున్నారు. ఖరీదైన జీవితంలో సింపుల్ గా కనిపించడం .. భోగాల మధ్య యోగిలా అనిపించడమే రజనీ ప్రత్యేకత. ఎదురులేని స్టైల్ .. తిరుగులేని క్రేజ్ అన్నట్టుగా మారిపోయిన ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం.

 (రజనీకాంత్ జన్మదిన ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : సావిత్రి ఒక సముద్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్