Saturday, April 20, 2024
Homeసినిమాస్నేహబంధం వల్లే నాటు నాటు గొప్పగా వచ్చింది - రామ్‌చరణ్‌

స్నేహబంధం వల్లే నాటు నాటు గొప్పగా వచ్చింది – రామ్‌చరణ్‌

ఆస్కార్‌ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ ‘నాటు నాటు’ ఉంది. ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్‌ వేసిన స్టెప్పులు, చూపించిన గ్రేస్‌కి ఫిదా అవుతున్నారు అభిమానులు. ఈ సందర్భంగా టాక్‌ ఈజీ షోలో సామ్‌ ఫ్రగోసోతో మాట్లాడారు రామ్‌చరణ్‌. 50 నిమిషాల పాటు సాగిన పాడ్‌కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి స్పందించారు రామ్‌చరణ్‌. ఈ టాక్‌ కేవలం ఆర్ఆర్ఆర్ తోనో, ఎస్‌ ఎస్‌ రాజమౌళితోనో, ఆస్కార్‌కి నామినేట్‌ అయిన నాటు నాటు పాటతోనే ఆగలేదు. అంతకు మించి సాగింది వాళ్ల సంభాషణ. మెగా వపర్‌ స్టార్‌ బాల్యం, ఆయన పెరిగిన విధానం, వాళ్ల తండ్రి చిరంజీవి క్రమశిక్షణ, తన దృష్టిలో ఆస్కార్‌ అంటే ఏంటి? వంటి విషయాలతో పాటు ఇంకా చాలా చాలా అంశాల మీద సాగింది డిస్కషన్‌. హాలీవుడ్‌ ఎగ్జిక్యూటివ్స్ తో టాక్స్ లో ఉన్న విషయాలను కూడా వెల్లడించారు. ఇందులో సరదా విషయం ఏంటంటే, తన మహిళా ఫ్యాన్స్ పంపిన కొన్ని మెసేజ్‌లను చరణ్‌తో చదివించడం… వాటిని చదువుతూ చరణ్‌ మొహమాటంగా, సిగ్గుపడటం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. రామ్ చరణ్‌ చెప్పిన కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే…

దీక్ష గురించి…
దీక్ష సమయంలో మాకు ఓ డ్రెస్ కోడ్‌ ఉంటుంది. నేల మీద పడుకుంటాం. దీక్షలో ఉన్నప్పుడు ఎలాంటి లగ్జరీలను ఉపయోగించం. అమ్మాయిలను ముట్టుకోం. ఎదురుగా ఉన్నది భార్యయినా సరే తాకకూడదు. వీటితో పాటు ఇంకా పలు కఠినమైన నియమాలను పాటిస్తాం. నాలో నేను క్రమశిక్షణను అలవాటు చేసుకోవడానికే దీక్ష చేస్తాను. నటుడిగా జీవితంలో చాలా విషయాలను చూస్తుంటాం. చాలా అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి వాటి వెనక మనసు పరుగులు తీయకుండా, మన అధీనంలో ఉండేలా ఉపయోగపడుతుంది దీక్ష.

నాటు నాటు విశేషాలు..
నాటు నాటు పాట కేవలం వినోదాత్మకంగా ఉండదు. ఆ సీక్వెన్స్‌ని రాజమౌళి చాలా అర్థవంతంగా తెరకెక్కించారు. ఆ పాటలో ఉన్న డ్రామా, ఎమోషన్స్ వల్లనే ఆ పాట ఆస్కార్‌ గడపను తొక్కగలిగింది. అవతలివారిని ఓడించిన తర్వాత తమలో తాము పోటీపడిన ఇద్దరు యువకులు, వారి ఆసక్తి, వారి పోటీతత్వం, ఉల్లాసం, హుషారు… ఇలాంటివన్నీ ఆ పాటను అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి. ప్రతి అడుగూ మాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఒకే ఒక స్ట్రెచ్‌ని దాదాపు రెండు రోజులు చిత్రీకరించాం. ఇద్దరి అడుగులూ, ఊపునూ ఒకేలా సింక్రనైజ్‌ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతి స్టెప్పూ, ప్రతి కోణంలోనూ పర్ఫెక్ట్ గా కుదిరింది. కీరవాణి అద్భుతమైన బీట్స్ ఇచ్చారు. పాట అంత అద్బుతంగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఉక్రెయిన్‌లో నాటు నాటు పాట కోసం మేం స్టెప్పులు వేస్తున్న సమయంలోనే యుద్ధమేఘాలు ఆవరించాయి. సెక్యూరిటీ కట్టుదిట్టమైంది. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ ఆయన ప్యాలస్‌లో మమ్మల్ని షూటింగ్‌ చేసుకోనిచ్చారు. చాలా బాగా అనిపించిన క్షణాలవి. స్నేహబంధం వలనే నాటు నాటు అంత గొప్పగా వచ్చింది.

జక్కన్న అపరమేధావి
కథ డిమాండ్‌ చేసిందనో, కేరక్టర్లు డిమాండ్‌ చేశాయనో కాదు, నన్నూ, తారక్‌నీ ఈ ప్రాజెక్ట్ లో పని చేయించాలన్న గట్టి సంకల్పం రాజమౌళి గారిది. నా సోదరుడు తారక్‌తో పని చేయడం అత్యంత సులువుగా, హాయిగా అనిపించింది. సెట్లో ఏక సమయంలో పది మంది స్టార్‌ హీరోలను కూడా హ్యాండిల్‌ చేయగల సత్తా రాజమౌళి గారి సొంతం. ఆయనేం చేస్తున్నారో ఆయనకు బాగా తెలుసు. సినిమా పూర్తయ్యేనాటికి ప్రతి ఒక్కరూ మెరిసి తీరుతారనే ధీమా ఆయన సొంతం. అత్యంత భారీ సినిమాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాకు పని చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు అలౌకికానందం కలిగింది. మేం అత్యంత ఛాలెంజింగ్‌ షాట్‌ చేసిన ప్రతిసారీ, ఆయన దగ్గర నుంచి మాకు దక్కే అత్యద్భుతమైన అప్రిషియేషన్‌ ఏంటో తెలుసా? నైస్‌ అన్నదే (నవ్వుతూ). ఆయన నైస్‌ అన్నారంటే, స్పాట్‌లో యాక్టర్‌ ఇరగదీసినట్టే. లాక్‌డౌన్‌ సమయంలో ఓ సారి నాకు రాజమౌళి వీడియో కాల్‌ చేసి, నేను పర్ఫెక్ట్ ఫిజిక్‌తో ఉన్నానా? షేప్‌లోనే కనిపిస్తున్నానా అని చెక్‌ చేసుకున్నారు. మేం ఏ మాత్రం సోమరితనంలోకి జారకుండా, ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇన్‌స్పయర్‌ చేస్తూనే ఉన్నారు రాజమౌళి. వీకెండ్స్ లో మాత్రం మేం ఎలా ఉండాలో అలా ఉండేలా స్వేచ్ఛనిచ్చారు. మిగిలిన రోజలు ఏమాత్రం ఉపేక్షించేవారు కాదు.

హాలీవుడ్‌ జర్నీ
సినిమాను ఆరాధించే ఏ దేశానికి సంబంధించిన చిత్రంలోనైనా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం కోరుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టు ప్రణాళిక చేయాలి. దాన్ని సాకారం చేసుకోవాలి. నేను ఆ దిశగానే చర్చలు జరుపుతున్నాను. మాటల దశలో ఉన్నాయి. అయితే అవి సినిమాలుగా ఎలా షేప్‌ తీసుకుంటాయన్నది చూడాలి. కొన్ని నెలల్లో వాటికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్