ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత – డిజిపి

Ramanuja Millennium  : హైదరాబాద్, శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీ రామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. రేపు (శనివారం) ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను డీజీపి మహేందర్ రెడ్డి తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి నేడు పరిశీలించారు. ఈ సందర్బంగా సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకంలో చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ ఆలయం హైదరాబాద్ కు ఒక వైపు అద్భుత దర్శనీయ క్షేత్రంగా మారనుండగా, మరో వైపు 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కలిగిన ముచ్చింతల్ మరో అద్భుత క్షేత్రంగా మారనుందని ఆకాక్షించారు. ముచ్చింతల్ లోని శ్రీరామ నగరం ప్రపంచంలోని వైష్ణవ ఆరాధకులకు ప్రధాన క్షేత్రంగా మారుతుందన్నారు. ప్రధాని, రాష్ట్రపతి ఇతర ప్రముఖుల పర్యటనలతోపాటు ఈ నెల 12 వ తేదీ వరకు జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసిందన్నారు.

డీజీపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానితోపాటు ఇతర ప్రముఖుల పర్యటనలతో పాటు ఈనెల 12 తేదీ వరకు జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లను చేపట్టిందని పేర్కొన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన రోజుల్లో ముచ్చింతల్ ఆశ్రమానికి సాధారణ ప్రజలకు అనుమతిలేదని, కేవలం ప్రత్యేక పాసులు కలిగిన వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకై దాదాపు 8 వేలకుపైగా పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మొత్తం కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఉత్సవాలలో మూడవ రోజైన శుక్రవారం నిర్వహించిన అష్టాక్షరీ మంత్ర జపం, పూర్ణాహుతి కార్యక్రమాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగాయి.

Also Read : సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *