Friday, March 29, 2024
HomeTrending Newsఅది సాధారణ విషయమే: అంబటి

అది సాధారణ విషయమే: అంబటి

చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే సెలెబ్రిటీ స్టార్ వారాహి ఇంకా రోడ్లపైకి రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. యాత్ర కోసం బండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడని, చివరకు అది తుప్పుపట్టిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

టీడీపీలో  కన్నా లక్ష్మీనారాయణ చేరికను తాము అతి సాధారణ విషయంగానే చూస్తున్నామని, ఆయన ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు… నిన్నటిదాకా బీజేపీ నాయకుడు…ఇప్పుడు టీడీపీ నేత అంటూ అంబటి విశ్లేషించారు. చంద్రబాబు చేతుల మీదుగా టిడిపి కండువా కప్పించుకున్న క్షణంలోనే ఆయన రాజకీయంగా మరణించినట్లు అంటూ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కొన్నాళ్లలోనే అతన్ని అధిష్టానం పక్కనబెట్టిందని, బిజెపి తిన్నింటి వాసాలు లెక్కపెట్టి.. మరలా జనసేనకు వెళ్లేందుకు బేరాలాడాడని, అతని వ్యాపారం పారలేదని,  ఇప్పుడు టీడీపీ గూటికి చేరాడని వెల్లడించారు.  నైతిక విలువలు కోల్పోయి.. పదవికోసం ఏ పార్టీ కండువానైనా వేసుకునే దిగజారుడు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అంటూ మండిపడ్డారు.

ఓ దినపత్రికపై కూడా అంబటి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.  “రాజకీయంగా, సామాజికంగా అన్నివిధాలుగా చచ్చిపోయిన చంద్రబాబును మరలా బతికించాలని.. అతన్ని అధికారంలోకి తీసుకురావాలని రాజగురువుగా చెప్పుకునే రామోజీరావు తెగ తాపత్రాయం పడుతుంటాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా వాడు కాదు.. చంద్రబాబే మాకు కావాల్సిన వాడు… అందుకని ఈ రాష్ట్రానికి చంద్రబాబునే మేం ముఖ్యమంత్రిని చేస్తాం’ అనేది రామోజీరావు ఆరాటం. అక్క ఆరాటమే కానీ బావ గెలిచేది లేదనే పాత సామెతను రామోజీరావు గుర్తుంచుకోవాలి. అయినా.. నీకేం పోయేంకాలం వచ్చింది రామోజీరావు? ఇంకా ఎన్నేళ్లు బతికి ఉంటావు..?  ముసలి వయసులో ధర్మంగా బతకాల్సిన నువ్వు.. ఇలాంటి నీచమైన కుట్రపూరిత ఆలోచనలకు ఒడిగడతావా..?” అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవిత్రమైన జర్నలిజంలో ఉన్నటువంటి రామోజీరావు పనిగట్టుకుని మరీ.. 2021 ఫిబ్రవరిలో పట్టాభి అనే వ్యక్తికి గుర్తుతెలియని దుండగుల దాడిలో చోటుచేసుకున్న గాయాల్ని తీసుకొచ్చి.. ఇప్పుడే తాజాగా పోలీసులు కొట్టారంటూ.. ఇది ప్రభుత్వ దుశ్చర్య అంటూ మొదటిపేజీలో ప్రచురించారని అంబటి విస్మయం వ్యక్తం చేశారు. “ఇది ఎంత దుర్మార్గం. ఇలాంటి నీచమైన వార్తలు రాసి వండివార్చిన రామోజీరావు తాను చేసిన తప్పునకు రేపు సాయంత్రంలోగా.. ‘మేం తప్పుడు రాతలు రాశాం’ అని క్షమాపణ చెప్పకపోతే ఈ ప్రభుత్వం తరఫున  క్రిమినల్ డిఫమేషన్ సూట్‌ ఫైల్‌ చేస్తామని హెచ్చరిస్తున్నాను” అన్నారు.

పట్టాభి, లోకేశ్, అయ్యన్నపాత్రుడు లాంటి తెలుగుదేశం నాయకులు తమనోటికి ఏది వస్తే అది… పచ్చిబూతులు సైతం మాట్లాడుతున్నారని, అత్యంత ప్రజాదరణ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని తప్పుడు మాటలు మాట్లాడతారని అంబటి ఫైర్ అయ్యారు. అలా మాట్లాడించిన చంద్రబాబు నాయుడు ఆ మాటలకు మరీ ఆనందపడతాడని, అది రాసి ఈనాడు రామోజీరావు మరింతగా ఆనందిస్తాడని అంబటి అన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే, పొలిటికల్‌ పోర్న్‌ స్టార్స్ గా వీళ్లని గుర్తించాలంటూ ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్