రావు రమేశ్ .. కేరక్టర్ ఆర్టిస్టుగా తన ప్రత్యేకతను చాటుకున్న నటుడు. ప్రకాశ్ రాజ్ ఫుల్ బిజీగా ఉన్న సమయంలో, ఆ స్థాయి నటుడు ఎవరున్నారా అని ఇండస్ట్రీ వెతుకుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన రావు రమేశ్, ఆడియన్స్ నుంచి అభిమానాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తనదైన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. దాంతో ఆయన కెరియర్ ఒక్కసారిగా దూసుకుపోయింది.
వరుసగా వచ్చి అవకాశాలు మీదపడినప్పటికీ రావు రమేశ్ ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పేసుకోలేదు. విలక్షణమైన పాత్రల వైపు మాత్రమే ఆయన మొగ్గుచూపుతూ వెళ్లారు. అందువల్లనే ఇప్పటికీ ఆయన ఇమేజ్ అదే స్థాయిలో కొనసాగుతోంది. అలాంటి రావు రమేశ్ ను ప్రధాన పాత్రగా చేసుకుని రూపొందించిన సినిమానే ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’. ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకే థియేటర్ల దగ్గర జనాలు పలచగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఓ మాదిరి హీరోల సినిమాలకి సంబంధించిన షోలు, తొలిరోజునే చాలా థియేటర్లలో కేన్సిల్ అవుతున్నాయి. అలాంటి ఈ పరిస్థితుల్లో ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమాను థియేటర్లలో వదలడం నిజంగా సాహసమేనని చెప్పాలి. మంచి రివ్యూలతో ఈ సినిమా దూసుకుపోతోండటం విశేషం. కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్న తన ప్రభుత్వ ఉద్యోగం కోసం కథానాయకుడు ఎదురుచూస్తూ, ఏ పనీ చేయకుండా చాలా సంవత్సరాలు గడిపేస్తాడు. అలాంటి పరిస్థితులలో అతని ఎకౌంటులో 10 లక్షలు పడతాయి. ఆ డబ్బు ఎక్కడిది? దాంతో అతని లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది? అనేది కథ.