చిరంజీవి కథానాయకుడిగా ‘విశ్వంభర’ సినిమా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరియర్ లోనే ఈ స్థాయి బడ్జెట్ ను కేటాయించడం ఇదే మొదటిసారి అనే టాక్ వినిపిస్తోంది. శ్రీవశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగు చకచకా కానిస్తున్నారు. కథాపరంగా ఈ సినిమాలో హీరోయిన్స్ చాలామంది కనిపించనున్నారనేది మరింత ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమా కథా పరిధి చాలా పెద్దది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన అందుకు అవసరమైన అన్ని రకాల హంగులు తోడవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరనే ఒక సందేహం అభిమానులలో ఆసక్తిని కలిగిస్తూ వెళుతోంది. ఎందుకంటే మెగాస్టార్ తో తలపడే విలన్ ఆ స్థాయిలోనే ఉండాలి. యాక్షన్ తో కాకుండా వ్యూహాలు పన్నడంలోనే ఆ పాత్రను రక్తికట్టించవలసి ఉంటుంది. అందువల్లనే ప్రతినాయకుడి పాత్ర ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ నేపథ్యంలోనే రావు రమేశ్ పేరు తెరపైకి వచ్చింది. ప్రధానమైన ప్రతినాయకుడిగా ఆయన కనిపించ నున్నారని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఆయనను సంప్రదించడం .. ఆయన అంగీకరించడం జరిగి పోయిందని చెబుతున్నారు. ప్రతినాయకుడిగా రావు రమేశ్ ఏ స్థాయి పాత్రనైనా అద్భుతంగా పోషించగలరు. అందువలన ఈ సినిమాలోని విలన్ పాత్రకి ఆయనే పూర్తి న్యాయం చేయగలరని భావించి, ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ విషయంపై అధికారిక సమాచారం రావలసి ఉంది.