Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంన్యాయం జరిగిందా? ...జరిపించారా?

న్యాయం జరిగిందా? …జరిపించారా?

Minor’s rape and murder, suspect Raju found dead on railway track

ఒక ప్రాణాన్ని కాపాడలేని వ్యవస్థ మరో ప్రాణాన్ని తీసేసి చెల్లుకి చెల్లంటుంది.
ఇది చాలా పాత చర్చ.
అంత ఘోరం చేసినవాడిని చంపిపారేయక చట్టాలు, కోర్టులు , జైళ్లేంటి.. అని 99 శాతం మంది అంటారు.
అయ్యో అలా అయితే, మన రాజ్యాంగం, కోర్టులు, చట్టాలు ఎందుకు? అని ఒక శాతం మంది అంటారు.
అత్యాచారం చేసి, హత్య చేసినవాడిని చంపితే తప్పేంటని 99 శాతం మంది ప్రశ్నిస్తారు.
తప్పు చేసినట్టు రుజువు అవ్వాలి…తప్పుకి తగ్గ శిక్ష చట్టప్రకారం పడాలి…అని ఒక్క శాతం సమాధానం చెప్తారు.

నేరం చేసిన వెంటనే చంపేస్తే కానీ, ఇకపై ఇలాటి రాక్షసుల్లో భయం రాదని 99శాతం మంది అభిప్రాయం.
ఎంత మందిని చంపినా నేరాలు పెరుగుతూనే వున్నాయి తప్ప తగ్గలేదు కదా అని ఒక్క శాతం మంది అడుగుతారు.
మన చట్టాలకి ఇలాంటి నేరస్తులని శిక్షించే శక్తి లేదని 99 శాతం మంది నమ్ముతారు.
వ్యవస్థలో మార్పురాకుండా ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం వుండదని ఒక్కశాతంమంది వాదించాలని ప్రయత్నిస్తారు.
ఇవి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు కదా!
99 శాతం మంది అభిప్రాయాలకే విలువిస్తాయి.

రైలు కింద రాజు పడ్డాడా?
“రాజు పడ్డాక” రైలు ఎక్కిందా?
ఇప్పుడీ చర్చే అనవసరం..
పోలీసులది ఇప్పుడొక విచిత్ర విజయగాధ.
మేం ఫెయిలయ్యాం అని చెప్పినా జనం నమ్మడం లేదు.
ఇది మీరు చేసిన ఘనకార్యమే అని వేనోళ్లపొగుడుతున్నారు.

వందల పోలీసులు, వేల సిసి కెమెరాల కళ్ళు గప్పి ఒక అనామకుడు వారంరోజులుగా తప్పించుకున్నాడని చెప్పినా నమ్మడం లేదు.
ఇదంతా మీ తెలివితేటలని మాకు తెలుసులే అని జనం కళ్ళు వెలిగిపోతున్నాయి..
ఎలాగైతేనేం..న్యాయం జరిగిందన్న సంతృప్తి ఆ కళ్ళలో కనిపిస్తోంది.
తెలంగాణ పోలీసులకిది ఆయాచిత విజయం కావచ్చు..
జనం నమ్ముతున్నట్టు ప్రాయోజిత విజయం కావచ్చు..
కానీ.. నా కొడుకుని మొన్నేచంపేసారని ఆ తల్లి వేదన మాత్రం అరణ్య రోదనే.
అసలు ఇంత ఘోరం జరిగాక ఇంకా వాడి గురించి , వాడి తల్లిఏడుపు గురించి ఆలోచించడమేంటని మళ్ళీ 99 శాతం మంది నిలదీస్తారు.
జనం నమ్మిందే న్యాయమైన చోట.. ప్రశ్నించేవాడిని కూడా పొడిచిచంపేయాలని తీర్మానించినా తప్పు కాదు.
అది అమలయిపోయినా ఆశ్చర్యం లేదు.

నిజమే.. ఘోరం జరిగింది..
ఆ పాప పడిన నరకయాతన గురించి చెప్పడానికి మాటలే లేవు.
అది తలచుకుని కుమిలిపోతున్న తల్లిదండ్రుల కన్నీళ్ళు ఇప్పట్లో ఇంకేవి కాదు.
వాళ్ళకి న్యాయం జరగాలనే అందరూ కోరుకుంటారు.
కాకపోతే, న్యాయం అంటే ఏంటి..
ఏం చేస్తే ఆ కుటుంబం తన కష్టాన్ని మరిచిపోగలదు.
ఏం చేస్తే, ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చగలరు.
జనం ఆవేశాలని రెచ్చగొట్టడం..
ఆ కుటుంబం బాధని పగా, ప్రతీకారాలుగా మార్చడం..

పోలీసులు చూపించే నిందితుడిని, ముందు వెనుక ఆలోచించకకుండా చంపేయాలని వెంటపడడం…
ఇవే మన సమాజ సహజన్యాయ సూత్రాలు.
99శాతం మంది నమ్మే శిక్షాస్మృతులు.
వీటికి ఎదురెళ్ళడం ఇప్పుడంత శ్రేయస్కరం కాదు.
“బయల్దేరాడు.. మేథావి..
వీళ్ల తల్లికో బిడ్డకో ఇలా జరిగితే తెలుస్తుంది..”
ఇలాంటి చాలా మాటలు పడాల్సొస్తుంది.
కానీ,ఇదే న్యాయం అనుకుంటే,
ఇకపై పోలీసులు ఎవరింటికి వచ్చినా..
ఎవరిని ఎత్తుకెళ్ళినా ఎదురు ప్రశ్నించకూడదు.
ఏరోజు ఎక్కడ ఎవరిని ఎన్ కౌంటర్ చేసినా, ఏ రైలు కింద పడేసినా ఇదేంటని అడగకూడదు.
ఏమో ఎవరు రేపిస్టులో, ఎవరు టెర్రరిస్టులో తేల్చడానికి మనం కోర్టులని , రాజ్యాంగాన్ని నమ్మం కదా!
పోలీసులు చెప్పిందే వేదం కదా!
న్యాయం అక్కడికక్కడే , అప్పటికప్పుడే జరగాలి కదా!
99శాతం మంది కోరుకునేది ఇదే కదా!

-శివ

Also Read:

మన చుట్టూ లేరా?

 

Also Read:

నేను బతికే వున్నా

RELATED ARTICLES

Most Popular

న్యూస్