Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్పొట్టి సారధ్యం ఇక వద్దు : విరాట్ కోహ్లీ

పొట్టి సారధ్యం ఇక వద్దు : విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్లో మొదలుకానున్న ఐసీసీ టి 20 వరల్డ్ కప్ తరువాత భారత జట్టు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.  యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 14న ముగియనుంది. ఈ మెగా టోర్నీ పూర్తయిన అనంతరం పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నాడు. టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని తాను బిసిసిఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి తెలియజేశానని కోహ్లీ పేర్కొన్నాడు.

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం, అందులోనూ సారధ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని విరాట్ కోహ్లీ ట్విట్టర్ ప్రకటన ద్వారా వెల్లడించాడు. ఇప్పటివరకు తనకు సహకరించిన జట్టు సభ్యులకు, యాజమాన్యానికి, సహాయక సిబ్బందికి, సెలెక్షన్ కమిటీ సభ్యులకు, అభిమానులకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. వారందరి మద్దతు, సహకారం లేనిదే తాను ఈ స్థాయికి చేరుకొని ఉండేవాడిని కాదని భావోద్వేగంతో చెప్పాడు.

గత తొమ్మిదేళ్లుగా జట్టు సభ్యుడిగా, ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్ల కెప్టెన్ గా తనకు పని భారం పెరిగిందని వెల్లడించాడు.  వన్డేలు, టెస్ట్ ఫార్మాట్ బాధ్యతలపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా తాను టి20 కెప్టెన్ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయమై కొంత కాలం క్రితమే తన సన్నిహితులైన ప్రధాన కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మలతో సంప్రదించానని చెప్పాడు.

కాగా, విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. భారత క్రికెట్ జట్టుకు విరాట్ విశేష సేవలందించాడని, మూడు ఫార్మాట్లలో విజయవంతమైన కెప్టెన్ గా ఖ్యాతి గడించాడని కొనియాడారు.

యువ ఆటగాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికితీసి జట్టును విజయ పథంలో నడిపించడంలో విరాట్ కృషి అమూల్యమైనదని  బిసిసిఐ కార్యదర్శి జై షా కితాబిచ్చాడు. ఆట తీరుకు, కెప్టెన్సీకి మధ్య సమతూకం చేసుకుంటూ రాణించాడని ప్రశంసించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్