పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల రీ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు, బ్యాలెట్ పేపర్లు తగలబెట్టడాలు, దొంగ ఓట్లు, పోలింగ్ బాక్సులు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు భారీగా జరిగాయి. ఇక పోలింగ్ రోజైన జూలై 8న (శనివారం) జరిగిన హింసలో ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ పార్టీలకు చెందిన 15 మంది మరణించారు. అనధికారికంగా 18 మంది మృతిచెందారు. దీంతో హింసాత్మక ఘటనలు జరిగిన 19 జిల్లాల్లోని 697 పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రీ పోలింగ్ నిర్వహిస్తోంది. ఈ రోజు (సోమవారం) ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
అత్యధికంగా ముర్షిదాబాద్‌లోని 175 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించనుండగా, మాల్డాలో 110, నాడియా 89, కూచ్ బేహార్ 53, ఉత్తర 24 పరగణాలు 46, ఉత్తర దినాజ్‌పూర్ 42, దక్షిణ 24 పరగణాలలో 36, పూర్వ మేదినీపూర్ 31, హుగ్లీ 29, దక్షిణ్ దినాజ్‌పూర్ 18, జల్పాయ్‌గురి 14, బీర్భూమ్ 14, పశ్చిమ మేదినీపూర్ 10, బంకురా, హౌరాల్లో 8 చొప్పున, పశ్చిమ బర్ధమాన్ 6, పురూలియా 4, పూర్వ బర్ధమాన్ 3, అలీపుర్‌దువార్‌లోని ఒక కేంద్రంలో రీ పోలింగ్ జరుగనుంది.
ప్రత్యెక రాష్ట్ర నినాదం బలంగా ఉన్న కొండప్రాంతాలైన డార్జిలింగ్, జార్గ్రామ్, కాలింపాంగ్ జిల్లాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం విశేషం. ఎన్నికల ఫలితాలు రేపు (జూలై 11)న వెలువడనున్నాయి.