Friday, March 28, 2025
Homeసినిమాపద్మనాభం నవ్వుల వెనుక కనిపించని కన్నీళ్లు! 

పద్మనాభం నవ్వుల వెనుక కనిపించని కన్నీళ్లు! 

పద్మనాభం .. ఈ పేరు చెప్పగానే తెరపై ఆయన చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది .. సందడి కళ్లముందు కదలాడుతుంది. బొద్దుగా .. తెల్లగా ఉండే కుదురైన రూపం .. విలక్షణమైన నవ్వు .. కళ్లతోనే పలికించే కామెడీ ఆయన సొంతం.  తాను ఎందుకు పనికి వస్తాననేది తెలుసుకోవడమే తెలివైనవాడి మొదటి లక్షణం అన్నట్టుగా పద్మనాభం తాను యాక్టింగ్ కి పనికొస్తానని స్కూల్ డేస్ లోనే గ్రహించారు. కడప జిల్లా పులివెందుల పరిధిలోని ‘సింహాద్రి పురం’లో జన్మించిన ఆయన, చిన్నప్పటి నుంచి చాలా చలాకీగా ఉండేవారు. నాటకాలపైకి మనసు వెళ్లడం వలన చదువుపై దృష్టి నిలవలేదు.

దాంతో శ్రద్ధ లేని చదువును భారంగా సాగదీస్తూ కాలాన్ని వృథా చేయడం కంటే, తనకి ఇష్టమైన సినిమాలలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆయన చెన్నైకి చేరుకున్నారు. అక్కడ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఎంతటివారినైనా మాటలతో బుట్టలో వేసుకోవడం ..  కొంతమంది నటీనటులను అనుకరిస్తూ నవ్వించడం ఆయనకి వెన్నతో బెట్టిన విద్య. చొచ్చుకుపోయే ఆ లక్షణమే ఆయనను స్టూడియోలలోకి అడుగుపెట్టేలా చేసింది. ఆనాటి స్టార్ ల  దృష్టిలో పడటానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు.

పద్మనాభం అందరికీ తెలిసేలా చేసింది రేలంగి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన దగ్గరుండి మరీ పద్మనాభానికి వేషాలు వచ్చేలా చేశారు. అలా పద్మనాభం తెరపై కమెడియన్ గా చేసిన సందడి అంతా ఇంతా కాదు. మాయలమారి మావ .. గడసరి అత్తల కళ్లుగప్పి తన భార్యను దొంగచాటుగా కలుసుకునే పాత్రల్లో పద్మనాభం నటనను ఎవరూ మరిచిపోలేరు. తాను ప్రధానమైన పాత్రగా కొన్ని సినిమాలు చేసిన ఆయన, ఆనాటి స్టార్స్ తోను భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. బాలసుబ్రమణ్యాన్ని గాయకుడిగా పరిచయం చేసింది ఆయనే.

‘నువ్వు మంచివాడివా .. అయితే మోసపోవడానికి సిద్ధంగా ఉండు’  అన్నట్టుగా, పద్మనాభం కూడా తాను నమ్మినవారి చేతిలో మోసపోయారు. అలా మోసపోయే సమయానికి వయసైపోయింది .. సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అందువలన ఆర్థికపరమైన నష్టాలను .. కష్టాలను అధిగమించే శక్తి ఆయనకి లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించడానికి మళ్లీ ఆయన నాటకాలను ఆశ్రయించవలసి వచ్చింది. ఎంతో కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన పద్మనాభం, నటుడిగా .. నిర్మాతగా ఒక వైభవాన్ని చూసిన పద్మనాభం ఆర్థికపరమైన సమస్యలతో అవస్థలు పడటం నిజంగా విచారించదగిన విషయమే.

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్