Saturday, January 18, 2025
Homeసినిమాసినీ మాంత్రికుడు.. కేవీ రెడ్డి

సినీ మాంత్రికుడు.. కేవీ రెడ్డి

Renowned Director KV Reddy Took Telugu Cinema To A New Era In 1950s Only : 

తెలుగు సినిమాకి సంబంధించిన తొలితరం దర్శకులలో కేవీ రెడ్డి పేరు ఎక్కువమందికి గుర్తుంటుంది. అందుకు కారణం ఆయన తెరకెక్కించిన సినిమాలు .. కథాకథన బలాలు .. చిత్రీకరణలోని ప్రత్యేకతలు .. ఆ సినిమాలు సాధించిన అఖండ విజయాలు అని చెప్పుకోవచ్చు. కేవీ రెడ్డి పూర్తి పేరు ‘కదిరి వెంకటరెడ్డి’ .. అనంతపురం జిల్లా ‘తాడిపత్రి’లో ఆయన జన్మించారు. ఆయన ఉన్నత విద్య మద్రాసులో సాగింది. తన స్నేహితుడైన ‘మూలా నారాయణస్వామి’ సహకారంతో ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.

వాహినీ సంస్థలో కొంతకాలం పాటు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన ఆయన, ఆ తరువాత దర్శకత్వం పట్ల గల ఆసక్తితో ఆ దిశగా అడుగులువేశారు. ఈ సమయంలో ఆయన వెన్నంటి నిలిచి ముందుకు నడిపించింది మూలా నారాయణ స్వామినే. ఆయన పెద్ద వ్యాపార వేత్త కావడంతో ఆయన మాట నెగ్గుతూ ఉండేది. సాధారణంగా దర్శకులలో చాలామంది తమ ఆసక్తికి తగినట్టుగా ఆయా జోనర్లను ఎంచుకుంటారు. అదే జోనర్లో సినిమాలు చేస్తూ వెళతారు. ఆ దర్శకుల నుంచి ఆ తరహా సినిమాలు చూడటానికే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతూ ఉంటారు.

కానీ కేవీ రెడ్డిగారు అలా కాదు .. ఏ జోనర్ కి చెందిన కథ అయినా, ఒక యజ్ఞం మాదిరిగానే దానిని మొదలుపెడతారు .. అంతే కార్యదీక్షతో పూర్తిచేస్తారు. ‘భక్తపోతన’ .. ‘యోగివేమన’ చారిత్రక నేపథ్యంలో సాగితే, ‘గుణసుందరి కథ’ ..  ‘పాతాళభైరవి‘ .. ‘ జగదేకవీరుని కథ’ సినిమాలు జానపదాలుగా ‘ఔరా!’ అనిపిస్తాయి. ఇక ‘మాయా బజార్’ .. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ పౌరాణిక చిత్రాలలో తలమానికంగా నిలుస్తాయి. ‘పెద్దమనుషులు’ .. ‘పెళ్లినాటి ప్రమాణాలు’ .. ‘దొంగ రాముడు’ జనం మెచ్చిన సాంఘిక చిత్రాలలో ముందు వరుసలో ముచ్చటగా కనిపిస్తాయి.

ఇలా కేవీ రెడ్డి ఏ జోనర్లో సినిమా చేసినా అదొక అద్భుతమైన దృశ్యకావ్యంగానే ప్రేక్షకులను మురిపించింది .. వాళ్ల మనసు మైదానంలో ఆనందానుభూతులను మొలిపించింది. కేవీ రెడ్డి ఏ కథను ఎంచుకున్నా, ముందుగా ఆ కథలోని ప్రతి అంశాన్ని సాధారణ ప్రేక్షకుల చెంతకి చేర్చగలమా? అనే ఆలోచించేవారు. అలాగే పాత్రలు .. వాటి స్వరూప స్వభావాలు ఎక్కడైనా దెబ్బ తింటున్నాయా? అని ఆలోచన చేసేవారు. పాటలలో సాహిత్యం సగటు ప్రేక్షకులకు అర్థమవుతుందా లేదా? అనే విషయంపై దృష్టిపెట్టేవారు.

ముఖ్యంగా కథను అందంగా .. అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నామా లేదా అనేది చూసుకునేవారు. అలాగే తెరపై ప్రతి దృశ్యం రమణీయంగా ఉందా? సన్నివేశాల్లో సహజత్వం ఆపాదించబడిందా? అనేది పరిశీలించేవారు. అందువల్లనే ఆయన సినిమాలు రివైండ్ చేసి గాలించినా, ఎక్కడ కూడా అనవసరమైన సీన్ .. పేలవమైన ఫ్రేమ్ కనిపించదు. అలాగే ఏ పాత్రకి  కూడా వేషధారణ విషయంలో లోపాలు దొరకవు. అప్పట్లోనే కేవీ రెడ్డి తన సినిమాల్లో హీరో హీరోయిన్లను ఎంతో అందంగా చూపించేవారు. అది సాంఘికమైనా .. జానపదమైనా .. పౌరాణికమైనా సరే, ఆయన తీసుకునే శ్రద్ధ మాత్రం ఒక్కటే.

కేవీ రెడ్డి ఒక సినిమా ఒప్పుకుంటే అది పూర్తయ్యేవరకూ మరో కథను గురించి ఆలోచన చేసేవారు కాదు. కథపై కొన్ని నెలలపాటు కసరత్తు చేసేవారు. పూర్తిస్థాయిలో చర్చలు జరిగిన తరువాతనే బౌండ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునేవారు. ఇక సెట్ పైకి వెళ్లిన తరువాత సింగిల్ డైలాగ్ మార్చడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. అందుకే ఆయన కథల్లో ఆ చిక్కదనం .. ఆ కథనంలోని కమ్మదనం ఇప్పటికీ కట్టిపడేస్తున్నాయి. ఆయన సినిమాలు పాలపుంతలా .. తేనె ముంతలా అనిపించడానికి ఇదే ప్రధమ కారణం .. ప్రధాన కారణం.

Renowned Director KV Reddy

కస్తూరి శివరావును ప్రధాన నాయకుడిగా చేసుకుని ఆయన ‘గుణసుందరి’ సినిమాను తెరకెక్కించడం అప్పట్లో ఆయన చేసిన సాహసం. కథాపరంగా .. పాత్ర పరంగా ఆయన తీసుకున్న ఆ నిర్ణయానికే అందరి ఓట్లు పడ్డాయి. ఇక ‘పాతాళ భైరవి’లో ఎస్వీఆర్ మాంత్రికుడి పాత్రను మలిచిన తీరు అద్భుతం. ఇప్పటికీ ఆ స్థాయి మాంత్రికుడిని మళ్లీ తెరపై మరొకరు చూపించలేకపోయారు. ‘మాయా బజార్’ సినిమాకి ముందే ఎన్టీఆర్ తెరపై కృష్ణుడిగా కనిపించారు .. కానీ ఆ వేషధారణ అంతగా ఆకట్టుకోలేదు. అయినా కేవీ రెడ్డి పట్టుబట్టి .. ఎన్టీఆర్ ను ఒప్పించి ‘మయా బజార్’లో కృష్ణుడి వేషం వేయించారు. ఆ తరువాత కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేలా చేశారు.

ఎన్టీఆర్ తో కలిసి పౌరాణిక చిత్రాల్లో మాత్రం కలిసి నటించకూడదని నిర్ణయించుకున్న ఏఎన్నార్ ను ఒప్పించి, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమాలో అర్జునుడి వేషం వేయించిన ఘనత కేవీ రెడ్డి సొంతం. ఆ సినిమాలో అర్జునుడిగా ఆయన ఏఎన్నార్ ను ఎంతో అందంగా చూపించారు. టైటిల్ కి తగినట్టుగా ఆ కథను .. ఆ పాత్రలను బ్యాలెన్స్ చేయడం కేవీ రెడ్డి ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలా అప్పట్లోనే ఆయన ఎన్నో ప్రయోగాలు .. మరెన్నో సాహసాలు చేశారు. తాను తెరకెక్కించిన చిత్రాల్లో చాలా వరకూ విజయాలను అందుకునేలా చేశారు.

Renowned Director KV Reddy

తెలుగు సినిమాను కొత్తపుంతలు తొక్కించిన కేవీ రెడ్డికి కూడా పరాజయాలు తప్పలేదు. ఆ సమయంలో కాలం .. కథలు కలిసిరాలేదు. ఒకప్పుడు ఆయన కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిర్మాతలు, ఆయనతో సినిమా చేయడానికి వెనకడుగు వేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఆయనకి ‘శ్రీకృష్ణ సత్య’ సినిమా చేసే అవకాశం ఇచ్చి, మళ్లీ విజయాన్ని అందుకునేలా చేశారు. ఒకరకంగా ఎన్టీఆర్ ఆయన పట్ల చూపించినది కృతజ్ఞత .. గౌరవం అని చెప్పుకోవాలి. ఈ తరం దర్శకులకు కేవీ రెడ్డి ఓ పెద్దబాలశిక్ష. తెలుగు కథకు ఆయన వెలుగు కిరణం .. తెలుగు సినిమాకు వెన్నెల ఆభరణం అని చెప్పుకోకతప్పదు. ఈ రోజున ఆయన జయంతి .. మంచిముత్యాల వంటి సినిమాలను అందించిన ఆయనను, మనసారా ఓ సారి స్మరించుకుందాం.

(కేవీ రెడ్డి జయంతి ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

Must Read : అమూల్యమననా! ఆణిముత్యమననా

RELATED ARTICLES

Most Popular

న్యూస్