Malladi no more: ప్రవచనకర్త, పౌరాణిక వాచస్పతి మల్లాది చంద్రశేఖరశాస్త్రి కన్నుమూశారు. వయోభారంతో హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో అస్తమించారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. 1925 ఆగస్టు 28న శాస్త్రి గుంటూరు జిల్లా క్రోసూరులో జన్మించారు. పురాణ ప్రవచనాలలో ఆయనకు ఆయనే సాటి.. భద్రాచలం శ్రీ సీతారామ కల్యాణ వేడుకల ప్రత్యక్ష వ్యాఖ్యానాలలో ఉషశ్రీతో కలిసి పాల్గొన్నారు. భారతము ధర్మసుక్ష్మ దర్శనము, క్రుష్ణలహరి (సేచ్చాంధ్రానువాదము), రామాయణ రహస్య దర్శిని గ్రంథాలను రచించారు. వేదాలు, శ్రౌతస్మార్త, వ్యాకరణతర్క వేదస్త సాహిత్యాలను చదివారు.
మల్లాది వారి మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక రంగానికి అయన చేసిన సేవలు అమూల్యమైనవని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన ప్రవచనాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూనే ఉంటాయని అన్నారు. కోట్లాది మంది ప్రజలు అయన భక్తి వచనాలకు ప్రభావితులయ్యారని గుర్తు చేసుకున్నారు. మల్లాది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.