Saturday, June 13, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమన సినిమా చరిత్ర-1

మన సినిమా చరిత్ర-1

రెంటాల జయదేవ జగమెరిగిన జర్నలిస్ట్. దాదాపు రెండొందల పుస్తకాలు రాసిన రచయిత, పండితుడు రెంటాల గోపాలకృష్ణ కొడుకు. ముప్పయ్యేళ్ళకు పైబడి రాస్తున్నవాడు. చెన్నయ్ లో తెలుగు ఇండియా టుడేలో పనిచేస్తున్నప్పుడు మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖలో సినిమాలమీద పి హెచ్ డి చేయబోయి…కుదరక…మరో అంశంమీద చేసి…ఆ పరిశోధనోత్సాహం అలాగే పాతికేళ్ళు కొనసాగితే- “మన సినిమా- ఫస్ట్ రీల్” పుస్తకమయ్యింది.

సాధారణంగా మనకు చారిత్రక దృక్పథం తక్కువ. పూర్వమెప్పుడో శాతబ్దాల క్రితం రాజులకాలం నాటి సంగతులను గాలికొదిలేసినా…నిన్న మొన్నటి విషయాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఏవీ స్పష్టంగా ఉండవు. ఎవరో ఎక్కడో చెప్పినవి నిజమని నమ్మి…ఆ రెఫరెన్సులనే ఎత్తి రాసుకుంటూ ఉంటాం. తారీఖులు, దస్తావేజులు, ఫోటోలు, వీడియోలు, ఉత్తరాలు ఇవి కావోయ్ చరిత్రకర్థం! అనుకుంటూ మనకు తోచింది చరిత్రగా రాసిపెడతాం. ఆ స్వకపోల కల్పితమే చాలాసార్లు చరిత్రగా సింహాసనమెక్కి కూర్చుంటుంది. అలా దక్షిణాది నాలుగు భాషల సినిమా, ప్రత్యేకించి తెలుగు సినిమా చరిత్ర గురించి రెంటాల జయదేవ చదవాలనుకున్నప్పుడు సరైన పుస్తకాలు దొరకలేదు. అరాకొరా దొరికినవాటిలో పరస్పర విరుద్ధమైన తేదీలు, సంవత్సరాలు, సంఘటనలు ఉన్నాయి. ఇంత గజిబిజిగా ఉన్న సినిమా చరిత్రను ఒక క్రమ పద్ధతిలో, స్పష్టమైన చారిత్రక ఆధారాలతో తనే ఎందుకు రాయకూడదు అనుకున్నాడు. సహజంగా జయదేవ సినిమా అభిమాని. ఎన్నో సినిమా సమీక్షలు రాసినవాడు. ఎందరో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసినవాడు. మీరెప్పుడు పుట్టారు? మీ తొలి రెమ్యునరేషన్ ఎంత? మీ తొలి పెంపుడు కుక్క పేరేమిటి? లాంటి లోకోత్తర ప్రశ్నలు కాకుండా…ఇంటర్వ్యూకు ముందు పరీక్షకు తయారైనట్లు ఇప్పటికీ ప్రశ్నలు కాగితంమీద రాసుకునే డొక్కశుద్ధి, చిత్తశుద్ధి రెండూ ఉన్న జర్నలిస్ట్ జయదేవ. ఒక చిన్న ఇంటర్వ్యూకే రెండ్రోజులు ప్రిపేరయ్యే జయదేవ సినిమా చరిత్ర పుస్తకం రాయడానికి పాతికేళ్ళ సమయం తీసుకోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు.

హైదరాబాద్, చెన్నయ్, తంజావూరు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, పూనా, బాంబే, ఢిల్లీ…ఇలా ఈ పుస్తక రచనలో ఆధారాలకోసం జయదేవ తిరగని ఊరు లేదు. కలవని మనిషి లేడు. తిరగేయని సినిమా పుస్తకం లేదు.

సినిమా అంటే సాధారణంగా- నిర్మాణ వ్యయం; ఎన్ని థియేటర్లలో ఎన్ని రోజులాడింది?; ఎంత కలెక్షన్లు? అన్నవే మనం మాట్లాడుకునే ప్రధానమైన విషయాలు. మొదటి ఆటకే పద్నాలుగు భువనభాండాల్లో ప్రేక్షకుల జేబులతో పాటు వారి గుండెలో రక్తాన్ని కూడా పీల్చేసే ఆధునిక అధికారిక దోపిడీ రోజుల్లో ఈ వివరాలు గుడ్డి గూగులమ్మ కూడా కథలు కథలుగా చెప్పగలుగుతోంది. నిజానికివి లెక్కలు. చరిత్ర కాదు. లెక్కలనే చరిత్రగా వీరాభిమానులు అనుకుంటే పర్లేదు కానీ…చారిత్రకస్పృహ ఉన్నవారు అనుకోకూడదు.

“కావ్యేషు నాటకం రమ్యం” అని కావ్యాల్లోకెల్లా నాటకమే అత్యంత రమ్యమైనదని సాహిత్య లక్షణకారుల నిర్ణయం. అలాంటి నాటకం మూగ సినిమాగా; ఆ మూగకు మాటలొచ్చిన తెలుపు- నలుపు సినిమాగా; ఆ తెలుపు- నలుపు రంగుల సినిమాగా రూపాంతరం చెందడం వెనుక ఎంతో ప్రయత్నముంది. తపన ఉంది. శ్రమ ఉంది. ఖర్చు ఉంది. సృజనాత్మకత ఉంది. సాహసం ఉంది. వినోదం ఉంది. విషాదం ఉంది. అవేమిటో తెలుసుకోవడానికే ఈ ‘ఫస్ట్ రీల్’.

మన నరనరాల్లో ఇంకిపోయిన సినిమా చరిత్రను పొరలు పొరలుగా విప్పి చూపడానికి జయదేవ పడ్డ కష్టమెంతో పుస్తకం తెరిచి చూస్తే మీకే తెలుస్తుంది. ఇది సంప్రదాయ పుస్తక సమీక్ష కాదు. కొంత జయదేవ గురించి, కొంత పుస్తకంలో ఉన్న విషయం గురించి.

“మన సినిమా ఫస్ట్ రీల్”
రచయిత- రెంటాల జయదేవ
ఫోన్- 94413 71357
పేజీలు- 566
వెల- రూ. 750
ప్రతులకు- ఎమెస్కో బుక్స్, హైదరాబాద్, విజయవాడ

రేపు:-
మన సినిమా చరిత్ర-2
“ఫస్ట్ రీల్ ఎందుకు?”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular