Saturday, November 23, 2024
HomeTrending Newsమే చివరి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి

మే చివరి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి

Review on Roads: గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ఈ ఏడాది 2,205 కోట్ల రూపాయలు కేటాయించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఒకేసారి  ఇచ్చిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదన్నారు. ‘ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదు, ఖర్చు చేయలేదు’ అంటూ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో  రహదారులు, భవనాలశాఖపై సిఎం సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా అధికారులు సిఎంకు వివరాలు అందిస్తూ ఇప్పటివరకూ 83శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని, నెలాఖరు నాటికి 100శాతం టెండర్లు పూర్తవుతాయని  వివరించారు. మే చివరి నాటికి దాదాపుగా రోడ్లు నిర్మాణం, మరమ్మతు పనులు పూర్తిచేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…

⦿ గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదు
⦿ తర్వాత వర్షాలు బాగాపడడంతో  రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి
⦿ ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి, ఒక ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారు

విశాఖ బీచ్‌కారిడార్‌ రోడ్డుపై కూడా సిఎం సమీక్షించారు. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి – భోగాపురం తిరిగి ఎన్‌హెచ్‌–16కు అనుసంధానం అయ్యే బీచ్‌కారిడార్‌ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో అధికారులు వివరించారు. దీనిపై కూడా సిఎం పలు సూచనలు చేశారు

⦿ రోడ్డు డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఈ బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఉండాలి
⦿ విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్‌ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకోవాలి
⦿ అలాగే ఎయిర్‌ పోర్టు నుంచి కూడా నగరానికి వీలైనంత త్వరగా రావాలి
⦿ దీంతోపాటు ఈ రహదారిని అనుకుని టూరిజం ప్రాజెక్టులు వస్తాయి
⦿ ఈ నేపథ్యంలో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది
⦿ ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌరవిమానాలు రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయి
⦿ రాత్రి పూట ల్యాండింగ్‌ కూడా నేవీ ఆంక్షలు కారణంగా కష్టం అవుతోంది
⦿ ఇలాంటి నేపథ్యంలో బీచ్‌ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది

33 ఆర్వోబీలు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్నాయని అధికారులు సమావేశంలో వివరించగా ఈ ప్రభుత్వం హయాంలోనే ఇవి పూర్తికాలేదన్న రీతిలో కథనాలు ఇస్తున్నారని సిఎం వ్యాఖ్యలు చేశారు. వీటిని పూర్తిచేయడానికి సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్‌ పి సీతారామాంజనేయలు ఇతర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్