ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒకచోట చేరినవారందరూ సైన్యంలో వైమానికదళంలో పనిచేశారు. ఇరవైఏళ్లపాటు సైనికులుగా పనిచేసి...అటు తరువాత వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అలాంటి వందమంది మాజీ సైనికుల రీ-యూనియన్ ముచ్చట్లు ఇవి. ఆ వందమందిలో ఒకరైన ఒకనాటి సైనికుడు, ప్రస్తుతం విశాఖపట్నంలో బ్యాంక్ ఉద్యోగి కిలపర్తి త్రినాథ్ పంచుకున్న సంగతులివి.
ఏనాటి రోజులో ఎదను తడిమే వేళ…
స్నేహాల సౌరభం మదిని తట్టిన వేళ…
కనులలో కస్తూరి కలలు దిద్దిన వేళ…
పదపదమంటూ ఫోను వచ్చిన వేళ…
ఓ మధ్యాహ్నం బ్యాంకు కౌంటర్లో బిజీగా ఉన్నప్పుడు మా తెనాలి రవిగాడి ఫోను.
ఒరేయ్ ఇరవైఏడు సంవత్సరాల తరువాత మళ్లీ మనందరం బెంగుళూరులో మన ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్లో కలవబోతున్నాం . మన వైపు వాళ్ళందరికీ నేను రిజర్వేషన్ చేయించేస్తున్నా…
వైజాగ్ నుండి మీ ఇద్దరూ, రాజమండ్రి నుండి రాజు, విజయవాడ నుండి మా ముగ్గురూ…హైదరాబాద్ ఆ పన్నెండు మందికీ శ్రీనుని చేయించమని చెప్పేస్తున్నా అనగానే..
పని ఆపి ఓ క్షణం కనులు మూసుకుంటే రెండున్నర పుష్కరాల కిందటి జ్ఞాపకాలు రెప్పలపై వాలి మెల్లగా పెదవిపై నవ్వుగా మారితే…
ఏం సార్ అంత హాయిగా నవ్వుకుంటున్నారు? ఏవైనా పాత కథలా! అని చనువుగా ఓ కష్టమర్ అడిగితే ఏమీ లేదంటూ నవ్వాను.
అయినా ఇది ఏ పాత ప్రేయసి పిలుపుకు తక్కువ?
ఏ లేత మనోచంచిలిత కావ్యాలకు తక్కువ?
రిజర్వేషన్లు అయిపోయాయి. రిసార్ట్ లు బుక్ అయిపోయాయి. దేశం నలుమూలల నుండి మరీ రాలేని పరిస్థితితుల్లో ఉన్నవారు తప్ప, ఆరోజు కోసం అందరివీ ఎదురు చూపులే. ఆ రాలేనివారికి ఇప్పటి నుండీ దిగులు చూపులే.
ప్రయాణం రోజు ఉదయాన్నే ఫోను. త్రినాధూ! భువనేశ్వర్ నుండి మనోరంజన్ ఫోన్ చేసాడు. లంచ్ తో పాటు ఆంధ్రా గన్ పౌడర్ తవ్పనిసరిగా పట్టుకు రమ్మన్నాడు అంటే…సరేనంటూ శ్రీమతితో ఒక చిన్న డబ్బాలో కారప్పొడి పెట్టమంటే ఆమె విచిత్రంగా చూసి ఇదెందుకు అంది. అప్పుడు ఓ అయిదు నిముషాలు మన ఆంధ్రా ఆవకాయలు, పొడులు అవి తిని అప్పట్లో ఉత్తరాది వాళ్ళ కళ్ళలో నీటి ప్రవాహపు కబుర్లు చెబితే సరే అంది నవ్వుతూ.
బ్యాగు పట్టుకొని బెంగుళూరు బయలు దేరుతుంటే ఒక్కసారిగా ఆనాటి అడుగులు కనులముందు కదిలాయి.
నాటి ప్రయాణం గుండెల్లో బెంగగా మొదలైతే… నేటి ప్రయాణం కన్నుల్లో పండుగ.
20 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి అపై తెలుగు వారమంతా తరచూ కలుసుకుంటూనే ఉన్నాం గానీ… కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ గుజరాత్ నుండి అస్సాంవరకూ ఉన్న వాళ్ళలో కొందరు కొందరినే కలవడం తప్ప మిగిలిన వారిని మధ్యలో అసలు చూడనే లేదు.
వాట్సాప్ పుణ్యమా అని మా ట్రైన్ లో ఉన్నోళ్ళంతా ఒక్కదగ్గర చేరి ఏభై వసంతాల దగ్గరలో ఉన్నా… సరదాగా తిట్టుకోగలిగే ఇప్పటి మలి పరిచయాలన్నీ పిల్లల చదువులతో పాటు పోల్చుకోలేని మా శారీరక నైసర్గిక స్వరూపాల గురించే.
గోదారి దాటి కృష్ణమ్మను దాటి సాగుతున్న మా రైలు ప్రయాణం ఓ జ్ఞాపకాల దొంతర. ఓ జీవన యాత్ర .
చుట్టుపక్కల ప్రయాణికుల్లో చాలామందికి అర్థమయిపోయింది –
ఈ వయసులో ఇంత అల్లరి చిల్లరిగా మాటాడుకుంటున్న ఈ గుంపు మదిలో సొంపు ఏ నాటిదో అని. వారి మనసులూ వారి వారి స్నేహాలను తలచుకుంటున్నాయేమో…అని.
మర్నాడు ఉదయాన్నే చేరాల్సిన రైలు కాస్త లేటు. అప్పటికే ఎక్కడెక్కడి నుండో వస్తున్న వారి మెసేజ్ లు చూస్తూ మా ఆలస్యానికి రైల్వేవారిని పిచ్చిపిచ్చిగా తిట్టుకుంటూ బెంగుళూరులో దిగి రిసార్ట్ కి చేరేసరికి దాదాపు వందమంది వచ్చేశారు. వారిని చూస్తుంటే మాతో కలసి పనిచేసిన వారు తప్ప కొందరు లీలగా జ్ఞాపకం రావడం, కొంతమందిలో మార్పులవల్ల అసలే పోల్చుకోలేకపోవడం. ఒక్కొక్కరిని- నీది ఢిల్లీ కదా? నీది జైపూర్ కదా? అని ఆత్మీయంగా పలకరించుకోవడం.
ఆపై అందరికీ ముందుగానే సైజ్ అడిగి కొన్న టీషర్ట్ లు, మెమొంటోలు పంచి భోజనాలు చేశాక ఆ పచ్చటి పచ్చికపై పిచ్చాపాటి మాటలాడుకోవడం .. ఫోను బ్యాటరీ అయ్యేటట్లు ఫోటోలు తీసుకోవడం.
అలా అలా ఆ సాయంసంధ్య సాగిపోతుంటే దూరంగా నీలాకాశం దిగొచ్చినట్టు రారమ్మంటున్న ఆ స్విమ్మింగ్ పూల్ వైపు మా తారాలోకం కదిలింది. అపుడు ప్రతి మోమూ చంద్రబింబమై వెలిగింది. ఈత వచ్చిన వారు చేపలవుతుంటే , రాని వారు రమ్మని పిలిచినా రామంటుంటే, భయం లేదని బలవంతంగా వారిని కొందరు నీటిలోకి లాగేస్తుంటే –
ఓ రెండు గంటలు
ఆ స్నేహభారతం తనువు తడిసి తానమాడింది.
మనసు మురిసి మాటలాడింది.
తడి పొడి కబరులయ్యాక కాఫీ టీలతో వెచ్చబడ్డాక ఆ సాయంత్రం అసలైన ప్రోగ్రాం మొదలైంది.
నాటి మిత్రుల్లో నేడు లోకంలో లేని ఏడుగురిని స్మరించుకుంటూ వారి కుటుంబాలకు అవసరమైన సాయం చేద్దామని తీర్మానించుకుంటూ, నెమ్మదిగా గాజు గ్లాసుల గలగలలు.. మందు చుక్కల గుసగుసలు మొదలయ్యాయి.
ఏ కొద్ది మందికో తప్ప డిఫెన్స్ లో ఓ సోషల్ స్టేటస్ గా అలవాటైన శృతిమించని ఆ సురాపాన సేవనం మొదలై, గొంతు దిగిన ప్రతి చుక్కకూ గుల్జార్ లు, జగ్జీత్ సింగ్ లు గజల్స్ పాడితే , ఆపై శృతి మారి సౌండ్ పెరిగి, చాలామంది ప్రభు దేవాలు, హృతిక్ రోషన్ లుగా మారిపోతే …
అంత వరకు చేయీ కాలూ కూడా కదపని వాడు సైతం
ఏ సంకోచమూ లేకుండా ఊగిపోవడమే ….
అలసిపోయి ఆగిపోవడమే …
మరలా గ్లాసు నింపుకోవడమే .. ఆపై తినీ , ఆ బెంగుళూరు చలిలో, క్యాంప్ ఫైర్ పక్కన ఎన్ని కబుర్లో!
మర్నాడు మా కళ్ళన్నీ మేము ట్రైనింగ్ అయిన జలహళ్ళి వైపే. ఆ గేటు ముందు అడుగెట్టగానే అందరిలో ఏదో ఉద్వేగం. నాటి మా గురువులు, అక్కడ పనిచేసిన వారి పేర్లతో సహా అందరినీ తలచుకుంటుంటే ఏదో తెలియని ఆనందభావం. అక్కడ వేసిన తొలి అడుగులు ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాయో అంటూ నాడు మేము ఉన్న రూములు, క్లాసు రూములు చూస్తూ అప్పుడు నడిచిన దారుల్లో మళ్ళీ నడుస్తూ మురిసిపోతూ, మైమరచిపోతూ ఆనాటి చిలిపి పనులూ, పనిష్మెంట్లు తలచుకుంటూ పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్తే ..మాలో ఒకరు గట్టిగా మార్చింగ్ కమాండ్ ఇవ్వగానే ఇన్నాళ్ళ తరువాత కూడా అందరి కాళ్ళు లయబద్ధంగా కదలడం ఎంత ఆనందమో!
వీడియోలు తీసుకుంటూ, విమానాలతో ఫోటోలు తీసుకుంటూ
అక్కడి ఎయిర్ ఫోర్స్ మెస్ లో మాకు పెట్టిన విందు రుచులను ఆస్వాదిస్తూ మరల ఎప్పుడనుకుంటూ, తరలిపోవడానికి తయారవుతుంటే, ఇంకో నాలుగేళ్ళ తరువాత ఈసారి ఢిల్లీలో అంటూ అక్కడే తీర్మానం జరిగిపోయింది.
ఆపై ఇక సరే అంటూ
సరదాల సమయం ఇంతే అంటూ …
కొన్ని జ్ఞాపకాలను ఎయిర్ పోర్ట్ వైపు,
కొన్ని ఆనందాలను రైల్వే స్టేషన్ల వైపు తీసుకుపోతున్న ఆ బస్సులు గాఢంగా అనుకునే ఉంటాయి.
రోజురోజుకీ భారమైపోతున్న బతుకుల్లో ఇటువంటి రోజులుంటేనే బాగుంటుంది కదా అని.
టైము దొరకని లోకంలో ఇటువంటి స్నేహితుల గుంపులు పెరిగితేనే బాగుంటుంది కాదా అని.
కాలంతో పాటు కొట్టుకు పోతున్న మనుషుల్లో కొన్ని వీడ్కోలు కన్నీళ్ళలోనే బతుకు ఇంద్రధనస్సులు కనిపిస్తాయేమో కదా అని.
-కిలపర్తి త్రినాధ్
9440886844
(భారత వాయుసేన మాజీ ఉద్యోగి. ప్రస్తుతం విశాఖపట్నంలో బ్యాంక్ ఉద్యోగి. రచన ప్రవృత్తి)