Saturday, November 23, 2024
HomeTrending Newsఅధికార విస్తరణకే కెసిఆర్ రాజకీయాలు - రేవంత్ విమర్శ

అధికార విస్తరణకే కెసిఆర్ రాజకీయాలు – రేవంత్ విమర్శ

నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల సిఎం కెసిఆర్ కు సానుభూతి ఉంటే… తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం కనిపించలేదా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వైఖరిని ఎండగడుతూ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు  బహిరంగ లేఖ విడుదల చేశారు.

లేఖలో ప్రస్తావించిన అంశాలు…

తెలంగాణకు చెందిన అమర జావాన్ యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం చేసిన అన్యాయం, పరిహారం విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం గురించి…
ఐన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న సామెత మీ చేష్టలకు సరిగ్గా సరిపోతోంది. తెలంగాణ ప్రజలు చెమట, రక్తం, కష్టార్జితం నుండి కట్టిన పన్నుల సొమ్మును అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు దేశమంతా తిరిగి పప్పుబెల్లాల పంచుతున్నారు. అమర జవాన్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా వారి త్యాగం పట్ల, వారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉంది. ఐతే, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్న తీరుగా మీ వ్యవహార శైలి ఉండటంపై మాత్రమే మా అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాం.
నిన్న బీహార్ రాష్ట్రంలో పర్యటించి గాల్వన్ లోయ అమరవీరుల కుటుంబాలకు మీరు తెలంగాణ తరఫున పరిహారం అందజేసి వచ్చారు. ఈ పర్యటనలో గానీ, మీ పరిహారంలో గానీ అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి కంటే మీ రాజకీయ, రాజ్యాధికార విస్తరణ కాంక్షే అధికంగా కనిపిస్తోంది. దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఉద్ధరించాలని ఇటీవల మీరు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ క్రమంలోనే ఈ పప్పుబెల్లాల పంపక కార్యక్రమాన్ని చేపట్టారని చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతోంది. అమర జవాన్ల మరణాలను సైతం మీ స్వార్థ రాజకీయాలకు వాడుకునే ఎత్తుగడ చూసి తెలంగాణ సమాజం విస్తుపోతోంది.
నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల మీకు సానుభూతి ఉంటే… తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం మీకు కనిపించలేదా? యాదయ్య త్యాగం మీకు యాదికి రాలేదా!? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య కాశ్మీర్ లో 2013 లో ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఆయన కుటుంబాన్ని అప్పట్లో అన్ని పార్టీలు పరామర్శించాయి. మీ పార్టీ తరఫున మీ కుమార్తె కవిత స్వయంగా వచ్చి పరామర్శించి వెళ్లారు. ఆ కుటుంబానికి ఐదెకరాలు భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొమ్మిదేళ్లు గడుస్తున్నా… ఆ హామీకి అతీగతీ లేదు. మన తెలంగాణ బిడ్డ అమరుడై, ఆయన కుటుంబం దిక్కులేనిదై రోడ్డున పడితే పట్టించుకోని మీరు… ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్ రాష్ట్రంలోని అమర జవాన్లకు పరిహారం ఇవ్వడం పరిహాసంగా అనిపించడం లేదా? ఇదేనా అమర జవాన్ల కుటుంబాల పట్ల మీకున్న చిత్తశుద్ధి?
రాజకీయ స్వార్థం కోసం మరీ ఇంతగా దిగజారకండి. ఇప్పటికైనా స్వార్థపూరిత విషపు ఆలోచనలకు కొంత విరామం ఇచ్చి… దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఆదుకోండి. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆ కుటుంబానికి ఐదెకరాలు వ్యవసాయ భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి. యాదయ్య పిల్లలకు మంచి చదువులు చెప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read : కెసిఆర్, హరీష్ రావులదే బాధ్యత – రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్