Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్KKR Won: రింకూ సింగ్ విధ్వంసం- గుజరాత్ కు ఓటమి

KKR Won: రింకూ సింగ్ విధ్వంసం- గుజరాత్ కు ఓటమి

ఈ సీజన్ ఐపీఎల్ లో ఓ అద్భుతమైన మ్యాచ్ నేడు క్రీడాభిమానులను అలరించింది. గుజరాత్ విసిరిన 205 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన కోల్ కతాకు చివరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా  రింకూ సింగ్ విధ్వంసం సృష్టించి కోల్ కతాను గెలిపించాడు. గుజరాత్ బౌలర్ యష్ దయాళ్ వేసిన చివరి ఓవర్ లో తొలి బంతిని సింగల్ తీసిన ఉమేష్ యాదవ్ రింకూకు స్ట్రయికింగ్ ఇచ్చాడు. అప్పటికి 28 పరుగులు అవసరం కాగా  మిగిలిన ఐదు బంతులనూ స్టాండ్స్ లోకి పంపి చిరస్మరణీయమైన విజయం అందించాడు.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా రషీద్ ఖాన్ సారధ్యం వహించాడు. జట్టు స్కోరు 33 వద్ద ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (17) ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 31 బంతుల్లో 5 ఫోర్లతో ­39; సాయి సుదర్శన్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53; విజయ్ శంకర్ ధాటిగా ఆడి 24 బంతుల్లో 4 ఫోర్లు. 5 సిక్సర్లతో 63 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.

కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన 3; సుయాష్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో కోల్ కతా 28 పరుగులకే రెండు వికెట్లు (జగదీషన్-6; రహమతుల్లా గుర్జాబ్-15) కోల్పోయింది. వెంకటేష్ అయ్యర్- కెప్టెన్ నితీష్ రానా మూడో వికెట్ 100 పరుగులు జోడించారు. నితీష్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 3  సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔట్ కాగా, సూపర్ ఇన్నింగ్స్ ఆడిన వెంకటేష్ అయ్యర్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆడ్రీ రస్సెల్(1), సునీల్ నరైన్ (డకౌట్), శార్దూల్ ఠాకూర్ (డకౌట్) విఫలమయ్యారు, 17 వ ఓవర్లో మూడు వరుస బంతుల్లో వీరిని పెవిలియన్ పంపిన గుజరాత్ స్టాండింగ్ కెప్టెన్ రషీద్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ దశలో రింకూ విజృంభించి 21 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులతో అజేయంగా నిలిచి విజయం అందించాడు.

రషీద్ మూడు; అల్జారీ జోసెఫ్ రెండు; షమీ, జాషువా లిటిల్ తలా ఒక వికెట్ సాధించారు.

రింకూ సింగ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్