కోవిడ్ బారిన పడ్డ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుని తిరిగి జట్టుతో చేరాడు. ఇంగ్లాండ్ నిబంధనల ప్రకారం 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్న పంత్ కు నిన్న కోవిడ్ తో పాటు గుండె సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించారు. ‘ హలో పంత్, టీమిండియా తో తిరిగి చేరడం సంతోషంగా ఉందంటూ’ బిసిసిఐ ట్వీట్ చేసింది.
డబ్ల్యూ టి సి ఫైనల్ అనంతరం 20 రోజుల విరామం కోసం లండన్ లోని ఒక హోటల్ లో భారత ఆటగాళ్లు బస చేశారు. వారికి ప్రతి వారం, పది రోజులకోసారి నిబంధనల ప్రకారం కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూలై 8న నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పంత్ కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది, వైరస్ లక్షణాలు ఏమీ లేకపోయినప్పటికీ వెంటనే అతణ్ణి ఐసోలేషన్ కు తరలించారు. బిసిసిఐ మెడికల్ సిబ్బంది పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ కావాల్సిన వైద్య సహాయం, సూచనలు అందించారు. పది రోజుల ఐసోలేషన్ అనతరం రెండుసార్లు జరిపిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ కావడంతో జట్టుతో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైద్య బృందం. ప్రస్తుతం దుర్హాన్ లో కౌంటీ సెలెక్ట్ లెవెన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది ఇండియా. అక్కడే జట్టుతో చేరాడు పంత్.
ఇండియా – ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో మొదటిది ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లి నేతృత్వంలో 20 మంది సభ్యుల జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది.
జూలై 14న నిర్వహించిన పరీక్షల్లో భారత జట్టుకు మసాజ్ చేసే దయానంద్ కు కూడా పాజిటివ్ గా తేలింది. దీనితో అతడితో క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, స్టాండ్ బై ఆడగాడు అభిమన్యు ఈశ్వరన్ లను కూడా అబ్జర్వేషన్ లో భాగంగా వారు బస చేస్తున్న హోటల్ రూమ్ లోనే ఐసోలేషన్ లో ఉంచారు.