దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హర్యానా, యూపీ, మధ్య ప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తోంది. రాష్ట్రంలో పలు వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మండిలోని పంచ్‌వక్త్ర ఆలయం నీటమునగగా, కసోల్ ప్రాంతంలోని కుల్లులో వరద నీటిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడటంంతో భాక్రా నంగల్ రహదారిని మూసివేశారు.
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ శక్తిపీఠం శ్రీ నైనా దేవి ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వరద నీరు ముంచెత్తడంతో పంజాబ్ వీధుల్లో పడవలు దర్శనమిచ్చాయి. కాగా, దేశ రాజధానిలో 41 ఏండ్ల గరిష్టస్ధాయిలో వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఒకేరోజు 153ఎంఎం వర్షపాతం నమోదవడంతో 1982 తర్వాత ఈ స్ధాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ వర్షాకాలం సీజన్‌లో ఢిల్లీలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఢిల్లీ వాసులు అప్రమ్తతంగా ఉండాలని ఐఎండీ యల్లో అలర్ట్ జారీ చేసింది.
కుండపోతతో దేశ రాజధానిలోని పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్లు, హాస్పిటల్ ప్రాంగణాలు, మాల్స్ సహా వాణిజ్య సంస్ధల ప్రాంగణాలు నీటమునిగాయి. భారీ వర్షాలతో ఢిల్లీ వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణీకులు, పాదచారులు మోకాలి లోతు నీళ్లలో గమ్యస్ధానాలకు చేరుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గురుగ్రాం సైతం భారీ వర్షాలతో వణికింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెగని వర్షాలతో గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించారు. సిమ్లాలో ముగ్గురు, చంబా, కులు ప్రాంతాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
బియాస్ నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తుండగా వరద పోటెత్తిన కాంగ్ర, మండి, సిమ్లా తదితర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఇక జమ్ము కశ్మీర్‌లో జీలం నదిలో నీటి ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రాజధాని చండీఘఢ్‌లో శనివారం రోజంతా కుండపోతతో నగరం తడిసిముద్దయింది.