పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సెనగల్‌లోని కఫ్రిన్ ప్రాంతం నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78 మంది గాయపడ్డారు. దేశంలోని ఒకటో నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు టైరు పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి రోడ్డుకు అవతలివైపునకు దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి.
కాగా ఈ ఘటనపట్ల దేశ అధ్యక్షుడు మాక్కి సాల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు దేశంలో సంతాప దినాలు పాటించాలని ప్రకటించారు. అధ్వానమైన రోడ్లు, వాహనాల డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడంతో దేశంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. 2017లో రెండు బస్సులు ఢీకొనడంతో 25 మంది దుర్మరణం చెందారు.