Saturday, November 23, 2024
Homeజాతీయంయు పి లో ఒక్కరు లేక ఇద్దరే ముద్దు

యు పి లో ఒక్కరు లేక ఇద్దరే ముద్దు

ఇదివరకు ఎక్కువగా పల్లెటూళ్లలో గోడలపై కుటుంబ నియంత్రణ ప్రకటనలు కనిపించేవి. చక్కని బొమ్మలతో ఆకట్టుకునే రీతిలో ఇద్దరు లేక ముగ్గురు చాలు అని ఉండేది. క్రమేణా అవన్నీ మాయమయ్యాయి. ఎంతసేపూ పత్రికల ప్రకటనలకే ఈ అంశం పరిమితమైంది. దాంతో కుటుంబ నియంత్రణ దేవతా వస్త్రంలా తయారైంది. కొందరేమో ఒక్కరే చాలంటారు. మరికొందరు ఒక కన్ను కన్నూ కాదు, ఒక బిడ్డ బిడ్డా కాదని అంటారు. దేవుడిచ్చిన బిడ్డల్ని కాదనడానికి మనమెవరమనే వారు మరికొందరు. నారు పోసిన వారు నీరు పోయరా అంటూ కంటూనే ఉండేవారు ఇంకొందరు. తాజాగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి తేనెతుట్టెను కదిపింది. పెరిగిపోతున్న జనాభాకు తగినట్టు అన్ని సౌకర్యాలు కల్పించడం భారత్ లాంటి దేశాల్లో సాధ్యం కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్లయినా ఏ మాత్రం మార్పులేని అంశం జనాభాయే. అంతకంతకూ ఆందోళన కలిగించే విధంగా పెరుగుతోంది దేశ జనాభా. ముఖ్యంగా చదువు, అవగాహన అంతంత మాత్రంగా ఉండే యూపీ లాంటి రాష్ట్రాల్లో కఠిన చర్యలే మార్గమని అక్కడి ప్రభుత్వం ఆలోచన. యూపీ లా కమిషన్ ఉత్తరప్రదేశ్ జనాభా బిల్లు తీసుకొచ్చింది.

జనాభా నియంత్రణే లక్ష్యంగా ‘ఇద్దరు పిల్లలు’ చాలంటున్న ఈ బిల్లులో పేర్కొన్న ముఖ్యంశాలు

  • ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేరు
  • ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రమోషన్లకు అనర్హులు
  • ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందవు. కుటుంబంలో నలుగురికే రేషన్ కార్డు
  • ఇద్దరు పిల్లల నిబంధన పాటించేవారికి ప్రభుత్వ సర్వీసులో ఉంటే అదనపు ఇంక్రిమెంట్లు, ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు (మెటర్నిటీ/పాటర్నిటీ)
  • ఇల్లు, ఫ్లాట్ కొనేటప్పుడు సబ్సిడీతో పాటు ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యుత్ చార్జీల్లో రాయితీ
  • ఒక్కరే సంతానం వున్నవారికి మరిన్ని ప్రోత్సాహకాలు

24 కోట్ల జనాభాతో సతమతమవుతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజా బిల్లు విమర్శకుల నోటికి పని పెట్టింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఇందుకు పూనుకున్నారని సమాజ్ వాదీ పార్టీ నేతలు విసుర్లు మొదలెట్టారు. ప్రభుత్వం మాత్రం వీలయినంత త్వరగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ఆలోచిస్తోంది. మరోపక్క అస్సాం రాష్ట్రంలో కూడా వచ్చేనెలలో ఇద్దరు పిల్లల నిబంధన బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నారు. మంచిదే, అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ఆలోచన చెయ్యాలి. అయితే ఈ మార్పు వృద్ధులు పెరిగి యువకులు తగ్గేదిగా ఉండకూడదు. అప్పుడు అసలుకే మోసం.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్